సింగరేణిలో ఇన్ చార్జిల పాలన ఇంకెన్నాళ్లు

సింగరేణిలో ఇన్ చార్జిల పాలన ఇంకెన్నాళ్లు

సింగరేణి సంస్థ ఆరు జిల్లాల వ్యాప్తంగా విస్తరించి దాదాపు నాలుగు వేల పెద్ద, మధ్యతరహా, చిన్న పరిశ్రమలకు ఆధారంగా మారింది. రెండు వేల మందికి పైగా అధికారులు, 42 వేల మంది కార్మికులు, ఉద్యోగులు, మరో 20 వేల మంది వరకు కాంట్రాక్టు కార్మికులు ఈ సంస్థలో పని చేస్తున్నారు. పాలనాపరంగా, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని కంపెనీని ముందుకు నడిపించడానికి  వివిధ విభాగాలకు యాజమాన్యం గతంలో డైరెక్టర్లను నియమించింది. కానీ నేడు కొత్తవారిని నియమించకుండా ఉన్నవారిపైనే అదనపు బాధ్యతలు మోపుతున్నది. దీంతో ఆయా డైరెక్టర్లకు వివిధ డిపార్ట్‌‌‌‌మెంట్లపై సరైన పర్యవేక్షణ లేక పాలన సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఐఏఎస్‌‌‌‌ అధికారుల పాలన

దేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత దాని ప్రభావం సింగరేణిపై కూడా పడింది. సంస్థ నష్టాలకు గురై బీఐఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ పరిధిలోకి వెళ్లింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత బడ్జెట్ సపోర్ట్‌‌‌‌ ఉండగా, అదీ బంద్‌‌‌‌ అయింది. దీంతో 1995లో ఐఏఎస్ ఆఫీసర్‌‌‌‌ ఏపీవీఎన్‌‌‌‌ శర్మ సింగరేణి సంస్థకు చైర్మన్‌‌‌‌, మేనేజింగ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌గా బాధ్యతలు చేపట్టారు. కానీ సంస్థలో కార్మిక సంక్షేమం, పరిపాలన, దుబారాను అరికట్టడం, మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని మరో ఐఏఎస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ హీరాలాల్‌‌‌‌ సమారియాను ‘పర్సనల్‌‌‌‌, అడ్మినిస్ట్రేషన్ అండ్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌’(పా) శాఖకు డైరెక్టర్‌‌‌‌గా నియమించారు. ఇద్దరు ఐఏఎస్‌‌‌‌ అధికారులు కలిసి కార్మికులను చైతన్యపరుస్తూ ముందుకు సాగారు. రూ. కోట్ల విలువైన మెషినరీలు, బేరింగ్‌‌‌‌లు, ఇతర సామగ్రిని ఇష్టం వచ్చినట్టు కాకుండా అవసరమున్న వరకే కొనుగోలు చేయడం, స్టోర్లలో వాటి వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేసి స్ట్రీమ్‌‌ ‌‌లైన్‌‌‌‌ చేయించారు. ఇక చీటికిమాటికి సమ్మెలు జరగడంతో సంస్థ ఆర్థికంగా దెబ్బతింటున్నదని భావించి 1998లో గుర్తింపు ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత కూడా సీఎండీగా ఐఏఎస్‌‌‌‌ అధికారులుంటే  డైరెక్టర్‌‌(పా) పోస్టులో కూడా ఐఏఎస్‌‌‌‌ అధికారులు అయ్యంగార్‌‌‌‌, వెంకటేశ్వరరావు, సుబ్రమణ్యం బాధ్యతలు చేపట్టి సంస్థను ముందుకు నడిపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 2014 వరకు ఐఏఎస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ (పా)గా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న సింగరేణి సంస్థను స్వయం ప్రతిపత్తిగల కంపెనీగా, బోర్డు ఆఫ్‌‌‌‌ డైరెక్టర్ల నిర్ణయాలే కీలకంగా, రాష్ట్ర ప్రభుత్వ మితిమీరిన జోక్యం లేకుండా తెలంగాణ ఏర్పడే వరకు పాలన చేశారు. 

పాలనపై ప్రభావం

సింగరేణిలో పనిచేసే డైరెక్టర్లకు అదనపు బాధ్యతలు అప్పగించడం, కీలకమైన డైరెక్టర్‌‌‌‌ (పా) పోస్ట్‌‌‌‌ను ఆరేళ్లుగా ఐఏఎస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌తో భర్తీ చేయకపోవడం వల్ల పాలనపై ప్రభావం చూపుతున్నది. సంస్థలో కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు సరిగ్గా అమలు జరగడం లేదనే వాదనలు కార్మిక సంఘాల నుంచి వస్తున్నాయి. గనులు, ఓసీపీల వద్ద కార్మికులు తమ బూట్లు, టోపీ, ఇతర వస్తువులను దాచి పెట్టుకునేందుకు బాక్స్‌‌‌‌లను ఏర్పాటు చేయిస్తామని చెప్పిన యాజమాన్యం నేటికి అన్ని గనుల్లో పెట్టలేకపోయింది. గనుల్లో రోజువారీగా ఉండే కార్మికుల సమస్యలు కూడా పరిష్కారం కావడం లేదు. వేతన ఒప్పందాల సమయంలో కూడా ఐఏఎస్‌‌‌‌ ఆఫీసర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. సింగరేణిలో భూగర్భ గనులు, ఓపెన్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ల విస్తరణకు భూ సేకరణ జరపాలి. ఇందుకు డైరెక్టర్‌‌‌‌ (పా) పర్యవేక్షణలో ఆయా జిల్లాల కలెక్టర్లతో చర్చించాల్సి ఉంటుంది. కానీ ఐఏఎస్‌‌‌‌ అధికారులైన జిల్లా కలెక్టర్లతో మైనింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ అయిన డైరెక్టర్‌‌‌‌ (పా) సరిగ్గా కలిసి చర్చించలేకపోతున్నట్టు స్పష్టమవుతున్నది. ఈ శాఖకు ఐఏఎస్‌‌‌‌లు ఉంటే ఒకే క్యాడర్‌‌‌‌ కావడంతో సమస్య త్వరగా సాల్వ్‌‌‌‌ అయ్యే అవకాశం ఉంటుంది. సింగరేణిలో వర్క్స్‌‌‌‌ టెండర్ కమిటీకి చైర్మన్‌‌‌‌గా, విజిలెన్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇన్​చార్జిగా ఒకే డైరెక్టర్‌‌‌‌ ఉన్నారు. అంటే తన పరిధిలోని ఒక శాఖలో జరిగే అవినీతిని మరో శాఖ పర్యవేక్షించడం ఎలా సాధ్యమవుతుందనేది ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఇటీవల కాలంలో క్లరికల్, ఇంజినీర్ల నియామకాలకు సంబంధించిన టెస్ట్‌‌‌‌లలో అనేక అవినీతి, అవకతవకలు జరిగాయి. సింగరేణి వ్యాప్తంగా కంపెనీ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి.  డైరెక్టర్లపై ఉన్న పని ఒత్తిడి వల్ల వీటన్నింటిని నిలుపుదల చేసే పరిస్థితి లేకుండా పోయిందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికైనా ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. 

డైరెక్టర్ల డ్యుయల్‌‌‌‌ రోల్‌‌‌‌

సింగరేణి సంస్థ సీఎండీగా ఐఏఎస్‌‌‌‌, డైరెక్టర్ ఫైనాన్స్‌‌‌‌గా ఐఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ మినహా మిగిలిన డైరెక్టర్లంతా మైనింగ్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ నుంచి తీసుకున్నవారే. ఆపరేషన్స్‌‌‌‌ విభాగం డైరెక్టర్‌‌‌‌గా నియమించిన మైనింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ ఎస్‌‌‌‌.చంద్రశేఖర్‌‌‌‌కు అదనంగా పా బాధ్యతలు అప్పగించారు. 2014 తర్వాత నుంచి ఈ పోస్ట్‌‌‌‌ను ఐఏఎస్‌‌‌‌తో భర్తీ చేయడం లేదు. అలాగే ఐఆర్‌‌‌‌ఎస్ ఆఫీసర్‌‌‌‌ బలరామ్‌‌‌‌ నాయక్‌‌‌‌ ఫైనాన్స్ డైరెక్టర్‌‌‌‌గా వ్యవహరిస్తుండగా ప్రాజెక్ట్స్‌‌‌‌, ప్లానింగ్‌‌‌‌ (పీఅండ్‌‌‌‌పీ) డిపార్ట్‌‌‌‌మెంట్ డైరెక్టర్‌‌‌‌గా నియమించిన మైనింగ్‌‌‌‌ ఆఫీసర్ వీరారెడ్డి విధుల్లో జాయిన్‌‌‌‌ కాకపోవడంతో ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. దీంతో డైరెక్టర్లు డ్యుయల్‌‌‌‌ రోల్ ప్లే చేస్తున్నారు.