'పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి, జహీరాబాద్ ఆస్పత్రులు 

'పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి, జహీరాబాద్ ఆస్పత్రులు 

సంగారెడ్డి, వెలుగు : ఆధార్ కార్డు కోసం ఇప్పటి వరకు మీ సేవ లేదా ఆధార్ నమోదు కేంద్రాలలో మాత్రమే దరఖాస్తు చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు  పుట్టిన శిశువుకు వెంటనే ఆస్పత్రుల్లో ఆధార్ కార్డు కోసం ఎన్రోల్​మెంట్​ చేసుకునే ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ లో శిశువుల ఆధార్​ ఎన్రోల్​మెంట్ ప్రారంభమైంది. దీని ఆధారంగా టెంపరరీ ఐడీ కూడా కేటాయిస్తున్నారు. 45 రోజుల తర్వాత మీసేవ కేంద్రాలకు వెళ్లి బిడ్డ పేరు నమోదు చేసి ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా సంగారెడ్డి, జహీరాబాద్ ఆస్పత్రులను ఎంపిక చేయగా, సంగారెడ్డిలో ఇప్పటివరకు 128 మంది పిల్లలకు సంబంధించి ఆధార్​ ఎన్రోల్​మెంట్​అయ్యింది. జహీరాబాద్ లో ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రసవాలు ఎక్కువగా జరిగే గవర్నమెంట్ ఆస్పత్రులను ఎంపిక చేసి ఆధార్ ఎన్రోల్​మెంట్​చేపడుతున్నారు. 

ఎన్రోల్​మెంట్​ ఇలా..

గవర్నమెంట్ హాస్పిటల్​లో ప్రసవమైన తర్వాత డిశ్చార్జి టైంలో ఎన్రోల్​మెంట్ ప్రక్రియ చేపడతారు. చైల్డ్ ఎన్రోల్​మెంట్ క్లైంట్ యాప్ లో తల్లి, బిడ్డ వివరాలు నమోదు చేస్తారు. ముందు తల్లి పేరు, ఆధార్ నంబరు, వేలిముద్రలు, కాన్పు వివరాలు, డిశ్చార్జి సర్టిఫికెట్, శిశువు ఫొటో, ఫోన్ నంబర్ ఇతరత్రా వివరాలు యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత నిర్దిష్ట ఫోన్ నంబర్ కు మెసేజ్ రూపంలో టెంపరరీ ఐడీ వస్తుంది. దాంతో అప్పుడే పుట్టిన బిడ్డ ఆధార్ ఎన్రోల్​మెంట్​ ప్రక్రియ పూర్తవుతుంది.