- ఈ నెల 27 వరకు నాలుగు రోజుల పాటు అధ్యయనోత్సవాలు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పూర్వగిరి(పాతగుట్ట) శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యుల అర్చకత్వంలో అర్చకులు తిరుమంజనం, తొళక్కం పూజలతో అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయంలోని స్వామివారి మూలవిరాట్లకు ‘తిరుమంజన’ మహోత్సవాన్ని ఆలయ సంప్రదాయరీతిలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు.
సాయంత్రం ఆలయంలో స్వామివారికి నిత్యారాధనల తర్వాత ‘తొళక్కం’ ఉత్సవాన్ని అర్చకులు ఘనంగా జరిపించారు. తొలిరోజు అధ్యయనోత్సవ కార్యక్రమంలో ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ వినోద్ రెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం మొదలైన ఈ ఉత్సవాలు ఈ నెల 27 వరకు నాలుగు రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి.
మరోవైపు అధ్యయనోత్సవాల సందర్భంగా ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆదివారం స్వామివారి మూలవరులకు పురప్పాటు సేవ, తిరుమంజనం, దివ్య ప్రబంధ సేవాకాలం నిర్వహించనున్నారు.
