
- పదేండ్ల పాలనలో గాంధీ ఆస్పత్రిని గాలికొదిలేశారు: విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఎన్నికలున్నందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ పేరిట డ్రామాలు ఆడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్మండిపడ్డారు. నగర ప్రజలను పక్కదారి పట్టించడానికే టిమ్స్ హాస్పిటల్ వద్ద హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షో చేశారని శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉండి ఎందుకు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించలేదో హరీశ్‌రావు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం పోవడానికి ఏడాది ముందు టిమ్స్ హాస్పిటల్స్ కు టెండర్లు పిలిచారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి వీటి నిర్మాణంపై ప్రత్యేక దృష్టిసారించారని వివరించారు.
రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల నిర్మాణం దాదాపుగా 90 శాతం పూర్తయిందని, సూపర్ స్పెషాలిటి హాస్పిటల్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లను నిర్మిస్తున్నామన్నారు. విదేశాల నుంచి వైద్యపరికరాలు రావాల్సి ఉన్నందునా ప్రారంభోత్సానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని, పేరు కోసం ఆదరాబాదరాగా ఆసుపత్రులను ప్రారంభించాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను గాలికి వదిలేసిందని ఫైర్ అయ్యారు. వరంగల్ లో ఎంజీఎం ఆసుపత్రి నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారని, ఆ ఆసుపత్రిని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.