కొత్త జెర్సీలలో మెరిసిపోతున్న భారత క్రికెటర్లు

కొత్త జెర్సీలలో మెరిసిపోతున్న భారత క్రికెటర్లు

రాబోవు ఐదేళ్ల కాలానికి భారత క్రికెట్ జట్లకు జెర్సీ స్పాన్సర్ చేసేందుకు అడిడాస్ సంస్థ బీసీసీఐతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకుగానూ అడిడాస్ సంస్థ బీసీసీఐకి రూ.350 కోట్లు చెల్లించనుంది. ఈ ఒప్పందం డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచే అమల్లోకి రానుంది. ఇప్పటికే టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్ చేరుకున్న భారత ఆటగాళ్లు అడిడాస్ కిట్లు ధరించి ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు. 

తాజాగా, అడిడాస్ కంపెనీ క్రికెటర్ల కొత్త జెర్సీలను విడుదల చేసింది. ఈ సందర్భంగా భారత మెన్, విమెన్ క్రికెటర్లు వాటిని ధరించి సందడి చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యాతో పాటు మహిళా క్రికెటర్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కొత్త జెర్సీలు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. అండర్-19 నుంచి భారత సీనియర్ జట్టు వరకు పురుషులు, మహిళా క్రికెటర్లు ఈ జెర్సీలను ధరించనున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. 

ఈ జెర్సీలను క్షణ్ణంగా పరిశీలిస్తే.. వన్డే ఫార్మాట్‌లో ధరించే బ్లూ జెర్సీల భుజాలపై తెల్లటి స్ట్రిప్స్ వేశారు. అదే టెస్టు జెర్సీలను చూస్తే.. భుజాలపై బ్లూ స్ట్రిప్స్, ముందు భాగంలో ఇండియా పేరును కూడా బ్లూ కలర్‌తో ముద్రించారు. ఇక టీ20 ఫార్మాట్‌‌కు ఎప్పటిలానే రౌండ్‌నెక్ టీ షర్ట్ ను కొనసాగించారు. ఈ జెర్సీలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అభిమానులు సైతం.. 'వావ్ అదిరింది లుక్..' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.