ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణకు ఓకే! :ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణకు ఓకే! :ఎమ్మెల్యే పాయల్ శంకర్
  • సచివాలయంల మంత్రి శ్రీధర్​బాబుతో చర్చ
  •  ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఎమ్మెల్యే పాయల్​ శంకర్​ వెల్లడి

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆదిలాబాద్​లో సిమెంట్ ​ఫ్యాక్టరీ(సీసీఐ) పునరుద్దరణపై సోమవారం రాష్ట్ర సచివాలంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు అధ్యక్షతన చీఫ్​ సెక్రటరీ ఎ.రామకృష్ణరావు, సీసీఐ సీఎండి సంజయ్ బంగా, ఎమ్మెల్యే పాయల్​శంకర్​తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సీసీఐ పునరుద్ధరణ నిర్ణయానికి వచ్చినట్లు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. 

సీసీఐ పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అనేక వనరులు ఇక్కడ ఉన్నాయని, పరిశ్రమను పునరుద్ధరించవచ్చని చర్చించినట్లు తెలిపారు. ఫ్యాక్టరీ ప్రాంతంలో 2 వేల ఎకరాల్లో నాణ్యమైన సున్నపు రాయి నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్లాంట్‌ పునరుద్ధరణకు సుమారు రూ.2 వేల కోట్లు అవసరమని సీసీఐ యాజమాన్యం అధికారులకు తెలిపినట్లు చెప్పారు. ఫ్యాక్టరీ పునరుద్ధరిస్తే దాదాపు 3 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. 

ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతమని, ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ ద్వారా విస్తృతమైన లాభాలు కలుగుతాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నట్లు చెప్పారు. సమావేశంలో గనులు, భూభాగాల ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీధర్, గనుల డైరెక్టర్ వెల్లూరు క్రాంతి, టీజీఐఐసీ ఎండీ శశాంక్ టాండూర్, సీసీఐ ప్లాంట్ జీఎం శరద్ కుమార్, సీసీఐ రీజినల్ మేనేజర్ ఉమేశ్​కుమార్ సింగ్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు.