ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం : కలెక్టర్ రాజర్షి షా

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం :  కలెక్టర్ రాజర్షి షా
  •     కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆసిఫాబాద్​కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం కలెక్టరేట్​లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్‌ బూతులు, సిబ్బంది నియామకం, భద్రతా చర్యలు, బ్యాలెట్‌ పత్రాలు, పోలింగ్‌ సామగ్రి పంపిణీ వరకు ప్రతి అంశాన్ని మండలాలవారీగా సమీక్షిస్తున్నట్లు చెప్పారు.

ఎన్నికల నిబంధనలపై అధికారులు, సిబ్బందికి ఇప్పటికే స్పష్టమైన సూచనలు జారీ చేశామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లోని 166 గ్రామ పంచాయతీలకు సంబంధించిన మొదటి విడత ఎన్నికల కోసం 1408 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 1478 మంది పీఓలు, 1729 మంది ఎపీఓలను నియమించామన్నారు. 

గ్రామీణ ఓటర్లు 4,49,981 మంది

జిల్లాలో మొత్తం 4,49,981 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారని కలెక్టర్ ​తెలిపారు. వీరిలో పురుషులు 2,19,652 మంది, మహిళలు 2,30,313, ఇతరులు 16 మంది ఉన్నారని వివరించారు. ఎన్నికల సమయంలో ఎఫ్‌ఎస్‌టీలు, ఎస్‌ఎస్‌టీలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాజేశ్వర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, ఆర్డీవో స్రవంతి, డీపీవో రమేశ్, డీపీఆర్వో విష్ణువర్ధన్ పాల్గొన్నారు.