ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

భైంసా,వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. బీజేపీ మాత్రం న్యాయాన్నే నమ్ముకుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. సోమవారం భైంసాలో బహిరంగ సభ ప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ నెల 17న నిర్మల్, భైంసాలో సభలు నిర్వహించేందుకు పోలీసులకు పర్మిషన్ ​అడిగామని, ఇచ్చినట్టే ఇచ్చి నిరాకరించారన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు భైంసాలో బహిరంగ ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే ఎంపీ సోయం బాపూరావు హైకోర్టులో విచారణ ప్రారంభమైన టైమ్​లో భైంసాకు వచ్చారు. పోలీసులు ఆయనను సభ ప్రాంగాణానికి వెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఎంపీ అరగంట పాటు రోడ్డుపైనే నిలుచున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత పోలీసులు ఎంపీని సభా స్థలికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సహా ఇన్​చార్జి మ్యాన మహేశ్, లీడర్లు పైడిపెల్లి గంగాధర్, నారాయణ్ రెడ్డి, గోపాల్​సార్డా, భోజారెడ్డి, ఓం ప్రకాశ్​లడ్డా  తదితరులు ఉన్నారు.

పోలీస్ స్టేషన్లలో మహిళలకు హెల్ప్ సెంటర్లు

ఆదిలాబాద్, వెలుగు: పోలీస్ స్టేషన్లలో మహిళలకు ప్రత్యేక హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం పోలీస్​ ట్రైనింగ్​ సెంటర్​లో ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా పోలీసు అధికారులకు వర్క్ షాప్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గించడానికి, నేరస్తులను కఠినంగా శిక్షించడానికి హెల్ప్​డెస్కులు సహాయపడుతాయన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించిన మహిళా హెల్ప్ డెస్క్ లకు కేటాయించిన 200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి  రెండు రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. అడిషనల్ ఎస్పీలు ఎస్ .శ్రీనివాసరావు, సి సమయ్ జాన్ రావు, ఉమెన్ సేఫ్టీ అడిషనల్ ఎస్పీ జి. రాజారత్నం, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాజేంద్రప్రసాద్, చైల్డ్ లైన్ రాష్ట్ర అధికారి రాజు కోటల్, ఈఐ మల్లేశ్, డీటీసీ వేణు తదితరులు పాల్గొన్నారు. 

చివరివరకు ప్రజల కోసమే పనిచేస్తా

భైంసా,వెలుగు: ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానని, ప్రాణం ఉన్నంతవరకు ప్రజలకోసమే పనిచేస్తానని సీనియర్​ పొలిటికల్​ లీడర్​రామారావు పటేల్​చెప్పారు. సోమవారం తన నివాసంలో కార్యకర్తల ఎదుట భావోద్వేగానికి గురయ్యారు. భైంసాలో బహిరంగ సభ కోసం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ సర్కారు ఎన్ని కుట్రలు చేసినా ధర్మమే గెలిచిందన్నారు. తన జీవితంలో ఎప్పుడు కూడా పోలీస్​స్టేషన్​లో అడుగుపెట్టలేదని,  ఆదివారం రాత్రి పోలీసులు తనను బలవంతగా స్టేషన్​కు తరలించారని, అక్కడే పడుకోవడం ఇదే తొలిసారన్నారు. కార్యకర్తలు, ప్రజల కోసం దేనికైనా రెడీగా ఉన్నానన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటానన్నారు. జిల్లా మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కారణంగా పోలీసులు బహిరంగ సభకు పర్మిషన్​ ఇవ్వలేదన్నారు. తాను ఎవరికీ భయపడే వ్యక్తికి భయపడనని, దేవుడికే భయపడుతానన్నారు. బంగారు తెలంగాణ అంటూ ప్రతీ వ్యక్తి నెత్తిపై అప్పుల భారం మోపి రాష్ట్రాన్ని నాశనం చేసిన ఘనత కేసీఆర్​కే  దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భైంసాలోని రామారావు పటేల్​ఇంటికి వచ్చారు. కార్యకర్తలు గ్రాండ్​వెల్​ కమ్​ చెప్పారు. ఆయనను రామారావుపటేల్​గజమాలతో సన్మానించారు. 

డీఎంహెచ్​వో ఆఫీస్​ ఎదుట ఆశ వర్కర్ల ధర్నా

మంచిర్యాల, వెలుగు: గుడిపేటలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీసు ఎదుట ఆశ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. పెండింగ్​ బిల్లులు చెల్లించాలని, టార్గెట్ల పేరుతో అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్​ చేశారు. అనంతరం డీఎంహెచ్​వో డాక్టర్​ సుబ్బరాయుడుకు పలు డిమాండ్లతో మెమోరాండం అందజేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్​కుమార్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సమ్మక్క మాట్లాడారు. గతంలో పలు సమస్యలను డీఎంహెచ్​వో దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. పెండింగ్ పీఆర్సీ అమలు చేయాలని, రెండేండ్లుగా పెండింగ్​ ఉన్న ఎండీఏ, లెప్రసీ బిల్లులు చెల్లించాలని, అర్హులైన ఆశ వర్కర్లను సెకండ్​ ఏఎన్​ఎంలుగా ప్రమోట్ చేయాలని, టార్గెట్ల పేరుతో వేధింపులు ఆపాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, టీఏ, డీఏలు చెల్లించాలని, రూ.20 లక్షలు ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్​ చేశారు. యూనియన్ జిల్లా కోశాధికారి సరోజ, ఉపాధ్యక్షురాలు అరుంధతి, లీలా, రాణి, కవిత, స్వరూప పాల్గొన్నారు.