మరోసారి నేరడిగొండ కేజీబీవీలో ఫుడ్ పాయిజన్..అస్వస్థతకు గురైన విద్యార్థులు

మరోసారి నేరడిగొండ కేజీబీవీలో ఫుడ్ పాయిజన్..అస్వస్థతకు గురైన విద్యార్థులు

ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) పాఠశాలలో విద్యార్థులకు మరోసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కేజీబీవీలో సెక్టోరియల్ ఆఫీసర్లు తనిఖీలు చేస్తున్నారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నిన్న అస్వస్థతకు గురైన కేజీబీవీ విద్యార్థుల సంఖ్య 25కు చేరింది. విద్యార్థులను రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు హాస్టల్‭లో మరికొంత మందికి కూడా అస్వస్థతగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నాణ్యత లేని భోజనం కారణంగా తాము అనారోగ్యం పాలైనట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా పురుగులు, రాళ్లు ఉన్న అన్నం పెడుతున్నారని ఆరోపించారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరాలతో తాము తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నా.. ప్రిన్సిపల్, సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అన్నంలో పురుగులు, రాళ్లు, వెంట్రుకలు వస్తున్నాయని స్టూడెంట్లు నిన్న ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. స్కూల్​ బిల్డింగ్​ పైకెక్కి నిరసన తెలిపారు. రోజూ పురుగుల అన్నం తింటుండడంతో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వంట మనిషిని విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పురుగుల అన్నం తిని మొత్తం 11 మంది స్టూడెంట్ల అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వారిని స్థానిక పీహెచ్ సీకి తరలించగా ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ కి తరలించారని వెల్లడించారు.

మరోవైపు.. నిన్న స్టూడెంట్ల ఆందోళన విషయం తెలుసుకున్న మండల బీజేపీ నాయకులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. స్టూడెంట్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పై అధికారులకు సమాచారం అందించగా సంబంధిత సిబ్బంది పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత స్టూడెంట్లను సముదాయించి ఆందోళనను విరమింపజేశారు.