అబ్బురపరిచే అటవీ సోయగాలు ఆదిలాబాద్ సొంతం

అబ్బురపరిచే అటవీ సోయగాలు ఆదిలాబాద్ సొంతం

అబ్బురపరిచే అటవీ సోయగాలు, ఆకట్టుకునే ఆదివాసీ గూడాలు, కొండలు, పచ్చని చెట్లు, పెద్ద పెద్ద రాళ్ల మీద నుంచి  కిందకు దుమికే జలపాతాలు... ఇవన్నీ ఆదిలాబాద్ నేల సొంతం. ఆకుపచ్చని చీర కట్టినట్టు ఉండే ఈ ప్రాంతంలో మనసుకి హాయినిచ్చే  ప్లేస్​లు చాలానే ఉన్నాయి. వీకెండ్​లో ఇక్కడికి వెళ్తే  కుంతాల జలపాతంతో పాటు పొచ్చెర వాటర్​ఫాల్​ని కూడా చూడొచ్చు. అడవితల్లి ఒడి అయిన ఆదిలాబాద్​లో చూడదగ్గ ప్రదేశాలివి... 

కుతుబ్​ షాహీల కాలంలో ఆదిలాబాద్​ని ‘ఎడ్లబాద్’ అని పిలిచేవాళ్లు. కాకతీయులు, మౌర్యులు, శాతవాహనులు, చాళుక్యులు, అసఫ్​జాహీలు పాలించిన నేల ఇది. మహారాష్ట్ర సరిహద్దుకు సమీపాన ఉండడంతో కొన్ని గ్రామాల ప్రజలు మరాఠి కూడా మాట్లాడతారు. ఆదివాసీ గూడాలు,  ఈ జిల్లాలో ప్రధాన ఆకర్షణ.    

వావ్​ అనిపించే వాటర్​ఫాల్స్

మనరాష్ట్రంలో గోదావరి, ప్రాణహిత నదులు మొదటగా పరవళ్లు తొక్కేది ఆదిలాబాద్​ నుంచే.  అంతేకాదు మనరాష్ట్రంలో ఎత్తైన జలపాతం కుంతాల ఈ జిల్లాలోనే ఉంది. గోదావరి ఉపనది అయిన కడెం నది మీద  ఏర్పడింది ఈ జలపాతం. ఇక్కడ రెండొందల అడుగుల ఎత్తు నుంచి నీళ్లు కిందకు దుముకుతాయి. వర్షాకాలంలో ఇక్కడికి వెళ్తే  పెద్ద బండరాయి మీద  నుంచి పాలనురగలా జారుతున్న నీళ్లను చూస్తూ మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ జలపాతం నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న  పొచ్చెర వాటర్​ఫాల్​, 19 కిలోమీటర్ల దూరంలో గాయత్రి వాటర్​ఫాల్ కూడా చూడదగ్గవే. వీటికి దగ్గర్లో సప్త గుండాల వాటర్​ఫాల్ ఉంటుంది. సప్త గుడాలు పేరుకు తగ్గట్టు అక్కడ ఏడు చిన్న  జలపాతాలు ఉంటాయి. 

జైనథ్​ గుడి

ఆదిలాబాద్​ వెళ్తే చూడాల్సిన మరో ప్లేస్ జైనథ్​ గుడి. ఈ ఆలయాన్ని నాలుగు నుంచి తొమ్మిదో శతాబ్దం మధ్య కాలంలో పల్లవ రాజులు కట్టించారు. జైన దేవాలయాన్ని పోలినట్టు ఉండడం ఈ గుడి ప్రత్యేకత. ఈ దేవాలయాన్ని రెండు అడుగుల ఎత్తైన ప్లాట్​ఫామ్ మీద పూర్తిగా నల్లరాయితో కట్టారు. గర్భగుడిలో ఆరడుగుల ఎత్తైన నారాయణస్వామి విగ్రహం ఉంటుంది. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ​ గుడి.