మైక్రో ఫైనాన్స్‌‌‌‌ పేరుతో మోసం.. నిందితుడు అరెస్ట్‌‌‌‌

మైక్రో ఫైనాన్స్‌‌‌‌ పేరుతో మోసం.. నిందితుడు అరెస్ట్‌‌‌‌

ఆదిలాబాద్, వెలుగు : మైక్రో ఫైనాన్స్‌‌‌‌ పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తిని ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆదిలాబాద్‌‌‌‌ ఎస్పీ అఖిల్‌‌‌‌ మహాజన్‌‌‌‌ బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఇంద్రవెల్లి మండలం శంకర్‌‌‌‌గూడకు చెందిన జవాడే కృష్ణ ఎస్‌‌‌‌కే మైక్రో ఫైనాన్స్‌‌‌‌ పేరుతో ఆఫీస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేసి ఫైనాన్స్, ప్రభుత్వ హాస్పిటల్స్‌‌‌‌, అంగన్‌‌‌‌వాడీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. జిల్లా కేంద్రంతో పాటు ఉట్నూర్‌‌‌‌లో ఆఫీసులు ఓపెన్‌‌‌‌ చేసి 300 మంది నుంచి సుమారు. రూ. 69 లక్షలు వసూలు చేశాడు. డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో బాధితులు ఆందోళన చేపట్టగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

నెల రోజులుగా పరారీలో ఉన్న కృష్ణను బుధవారం అరెస్ట్‌‌‌‌ చేసి అతడి వద్ద నుంచి రూ. 9 లక్షలు, 10.07 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. ప్రధాన నిందితుడు కృష్ణతో పాటు అతడి తమ్ముడు గోపాల్, ఏజెంట్లు ఆత్రం నారాయణ, డాకురే శత్రుఘన్‌‌‌‌, మధ్యవర్‌‌‌‌ ఆధినాథ్‌‌‌‌లను అరెస్ట్‌‌‌‌ చేయగా.. ప్రహ్లాద్‌‌‌‌ పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట ఉట్నూర్ ఏఎస్పీ కాజల్‌‌‌‌ సింగ్‌‌‌‌, సీఐ ఎం.ప్రసాద్, ఎస్సై గోపికృష్ణ ఉన్నారు.