చనాక కోర్టా నిర్వాసితులకు పరిహారం ఇవ్వండి : పాయల్ శంకర్

చనాక కోర్టా నిర్వాసితులకు పరిహారం ఇవ్వండి : పాయల్ శంకర్
  •     రైతులకు డిమాండ్​ ఉన్న విత్తనాలు అందించండి
  •     సీఏం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినతి

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ నియోజకవర్గంలో చనాక- కోర్టా ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు వెంటనే రూ.94 కోట్ల పరిహారం అందించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. గురువారం సాయంత్రం హైదరాబాద్​లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ సమస్యలు విన్నవించారు. భూ సేకరణ కింద పట్టణంలోని బాధితులకు ప్రభుత్వం రూ.27 కోట్లు చెల్లించాల్సి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. నిధులు విడుదల కాకపోవడంతో జిల్లా కేంద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జి, ఓవర్ బ్రిడ్జి పనులు నిలిచిపోయాయని తెలిపారు. 

జిల్లాలో పత్తి రైతులకు అవసరమయ్యే విత్తనాలు దొరక్క రోడ్లపై పడిగాపులు కాస్తున్నారని, నకిలీ విత్తనాల బెడదను అరికట్టి రైతుల డిమాండ్​కు అనుగుణంగా విత్తనాల పంపిణీ చేపట్టాలని కోరారు. సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎంతో పాటు జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్కకు కూడా పాయల్ శంకర్ వినతి పత్రం అందించారు.