బైక్‌లు చోరీలకు పాల్పడిన దొంగ అరెస్ట్‌

బైక్‌లు చోరీలకు పాల్పడిన దొంగ అరెస్ట్‌
  • రూ. 4 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
  • దొంగ బైక్‌లు కొన్న 12 మంది అరెస్ట్‌

ఆదిలాబాద్, వెలుగు : హాస్పిటల్స్‌ వద్ద పార్క్​ చేసిన బైక్‌లను చోరీలకు  పాల్పడుతున్న దొంగను ఆదిలాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం ఆదిలాబాద్‌ టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ కేసు వివరాలను వెల్లడించారు. నేరడిగొండ మండలానికి చెందిన చౌహాన్‌ శ్రావణ్‌కుమార్‌ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌, నిర్మల్‌ పట్టణంలోని హాస్పిటల్స్ వద్ద పార్కింగ్‌ చేసిన బైక్‌లను దొంగిలించేవాడు. అనంతరం ఆ బైక్‌ల నంబర్‌ ప్లేట్లు, ఇంజిన్‌ ఛాసిస్‌ నంబర్లను మార్చి నకిలీ నంబర్లతో ఇతరులకు అమ్మేవాడు. ఇప్పటివరకు ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో ఇతడిపై 11 కేసులు నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

శనివారం ఆదిలాబాద్​లో శ్రావణ్​కుమార్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడి నుంచి దాదాపు రూ.4 లక్షల విలువైన 12 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడి అరెస్ట్​చేసి రిమాండ్​కు తరలించారు. దొంగిలించిన బైక్‌లను తక్కువ ధరకు వస్తున్నాయని ఆశ పడి, ఎలాంటి పత్రాలు లేకుండా కొనుగోలు చేసిన 12 మందిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో 11 మందిని అరెస్ట్‌ చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. దొంగను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ జీవన్‌రెడ్డి, టూ టౌన్‌ సీఐ నాగరాజు, ఎస్‌ఐలు పీర్‌సింగ్, విష్ణుప్రకాశ్​ను ఎస్పీ అభినందించారు.