
నేరడిగొండ, వెలుగు: చిన్నప్పటి నుంచే వ్యాయామం అలవాటు చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్క్ ను మంగళవారం ఆయన ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ పిల్లలతో సరదాగా మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ లో నివసించే చిన్నారులు, బయటి విద్యార్థులు ఈ చిల్డ్రన్స్ పార్కును పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు. ఆటలు ఆడుతూ, వ్యాయామం చేస్తూ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. పోలీస్ స్టేషన్లో పిల్లల కోసం పార్కును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలను పరిశీలించారు. మండలంలో మైనర్ డ్రైవింగ్, ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా నిత్యం డ్రంకన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. గంజాయిని సమూలంగా నిర్మూలించాలని, సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఇచ్చోడ సీఐ భీమేశ్, ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.