
- నేషనల్అవార్డు ప్రకటించిన కేంద్రం
- అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్, వెలుగు: భూగర్భ జలాల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం జల్ సంచయ్ జన్ భాగిదారిలో ఆదిలాబాద్జిల్లా అగ్రస్థానంలో నిలిచి నేషనల్అవార్డు దక్కించుకుంది. జిల్లాలోని చెరువులు, వాగులు, వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, చెక్‌డ్యాంల నిర్మాణం, మరమ్మత్తులు చేపట్టడం, భూగర్భజలాలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం, ప్రజలను భాగస్వాములను చేయడం లాంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకుగాను కేంద్రం జాతీయ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు కింద రూ.2 కోట్లు అందజేయనుంది.
గతంలో సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులు జిల్లాలో పర్యటించి జల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. దీనిపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయగా జిల్లా పనితీరు మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. జిల్లాకు జాతీయ అవార్డు దక్కడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు అభినందనలు తెలియజేశారు.
నిర్మల్ జిల్లా కు రెండో ర్యాంక్
నిర్మల్, వెలుగు: నీటి సంరక్షణ, ప్రజల భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణలో జల్ సంచయ్ జన భాగిదారి కార్యక్రమంలో నిర్మల్‌జిల్లా జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. దీంతో జిల్లాకు రూ.కోటి నగదు బహుమతి లభించనుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ఈ అవార్డు నిర్మల్ జిల్లా ప్రజల కృషి, నిబద్ధతకు నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో మరింత పనిచేసి అభివృద్ధి రంగాల్లో జాతీయస్థాయిలో అగ్రస్థానం సాధించేలా కృషి చేస్తామన్నారు.