జనవరి 6న గమ్యాన్ని చేరుకోనున్న ఆదిత్య ఎల్‌‌1

జనవరి 6న గమ్యాన్ని చేరుకోనున్న ఆదిత్య ఎల్‌‌1

అహ్మదాబాద్: సూర్యుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ‘ఆదిత్య ఎల్1’ మిషన్.. కీలక మైలురాయి దిశగా సాగుతున్నది. తన గమ్యస్థానమైన లగ్రాంజియన్ పాయింట్(ఎల్‌‌1)ను జనవరి 6న ఆదిత్య చేరుకోనుందని ఇస్రో చైర్మన్‌‌ ఎస్‌‌.సోమనాథ్‌‌ ప్రకటించారు. విజ్ఞాన భారతి అనే ఎన్జీవో సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.

 ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జనవరి 6న ఎల్‌‌1 పాయింట్‌‌లోకి ఆదిత్య ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నాం. కచ్చితమైన టైమ్‌‌ను త్వరలో వెల్లడిస్తాం. ఎల్‌‌1 పాయింట్‌‌కు స్పేస్‌‌క్రాఫ్ట్ చేరుకున్న తర్వాత మరోసారి ఇంజిన్‌‌ను మండించాల్సి ఉంది. తర్వాత అది ఎల్‌‌1 కేంద్రంలో స్థిరపడుతుంది.. కక్ష్యలో తిరుగుతూ ఐదేండ్లపాటు సూర్యుడిని నిశితంగా గమనిస్తుంది. ముఖ్యమైన సమాచారాన్ని ఇండియా సహా ప్రపంచ దేశాలకు అందిస్తుంది. సూర్యుడిలో జరిగే మార్పులు, అవి మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుంది’’అని ఆయన వివరించారు.