49 జీవోను శాశ్వతంగా ఎత్తివేయాలి..ఆసిఫాబాద్‌‌ కలెక్టరేట్‌‌ ముట్టడికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు

49 జీవోను శాశ్వతంగా ఎత్తివేయాలి..ఆసిఫాబాద్‌‌ కలెక్టరేట్‌‌ ముట్టడికి యత్నం.. అడ్డుకున్న పోలీసులు
ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్‌‌ జిల్లాను కన్జర్వేషన్‌‌ రిజర్వ్‌‌గా ప్రకటిస్తూ విడుదల చేసిన జీవో 49ను శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్‌‌ చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఆసిఫాబాద్‌‌ కలెక్టరేట్‌‌ ఎదుట బైఠాయించి జీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్‌‌ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం అడిషనల్‌‌ కలెక్టర్‌‌ దీపక్‌‌ తివారికి వినతిపత్రం అందజేశారు.
 
అంతకుముందు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక విజయ్‌‌కుమార్‌‌ మాట్లాడుతూ అటవీ సంపదపై ఆధారపడి బతుకుతున్న ఆదివాసీలను.. పులుల సంరక్షణ పేరుతో వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పీసా చట్టాన్ని తుంగలో తొక్కి ఎలాంటి తీర్మానాలు లేకుండా జీవో అమలుచేయడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి 49 జీవోను శాశ్వతంగా రద్దు చేయాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాకు బీజేపీ, సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సిర్పూర్‌‌ ఎమ్మెల్యే హరీశ్‌‌బాబు, జడ్పీ మాజీచైర్మన్‌‌ కోనేరు కృష్ణ, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌‌ పాల్గొన్నారు.