ఎస్టీ నుంచి లంబాడీలను తొలగించాలి.. ఆదివాసీల డిమాండ్

ఎస్టీ నుంచి లంబాడీలను తొలగించాలి.. ఆదివాసీల డిమాండ్
  • భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆదివాసీలు

ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు :  ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివారం ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఉట్నూర్‌‌‌‌‌‌‌‌ ఎంపీడీవో గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో ఆదివాసీ ధర్మయుద్ధ సభ నిర్వహించారు. ఈ సభకు ఆదివాసీ ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, కోవ లక్ష్మి, జీసీసీచైర్మన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ తిరుపతి, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గొడం గణేశ్‌‌‌‌‌‌‌‌తో పాటు భారీ సంఖ్యలో ఆదివాసీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మైపతి అరుణ్‌‌‌‌‌‌‌‌కుమర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ... వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 1956 నుంచి 1976 వరకు ఎస్టీ జాబితాలో లేని లంబాడీలు.. తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి ఆదివాసీలకు రావాల్సిన ఉద్యోగాలు పొందుతున్నారని ఆరోపించారు.

 తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ... ఏ రాజకీయ పార్టీ కూడా ఆదివాసీ పల్లెలను అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ఆదివాసీల ధర్మ యుద్ధ సభ అనంతరం పలు తీర్మానాలు ఆమోదించారు. చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన లంబాడీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. అలాగే ఆదివాసీల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక చట్టం చేయాలని, షెడ్యూల్డ్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. లంబాడీల తొలగింపు కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరగా కౌంటర్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నియామకాల్లో లంబాడీలను ఎస్టీలుగా పరిగణించవద్దని, ఐటీడీఏల్లో స్థానిక ఆదివాసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానం చేశారు. సభకు ఆదివాసీలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. 

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌‌‌‌‌‌‌‌

ఆదివాసీ, లంబాడీల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. ఈ విషయంపై త్వరలోనే ఆదివాసీ సంఘాల నాయకులు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డిని కల్పించేలా చర్యలు చేపడుతానన్నారు. ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ కొందరు నాయకులు స్వార్థం కోసం జాతిని వాడుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీలను పక్కన పెట్టి జాతి ప్రయోజనాల కోసం పోరాటం చేయాలని
 పిలుపునిచ్చారు.