వందల ఎకరాలు ఉన్నోళ్లకు రైతుబంధు ఎందుకు?

వందల ఎకరాలు ఉన్నోళ్లకు రైతుబంధు ఎందుకు?

భద్రాచలం, వెలుగు : బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ, భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్ చార్జి తాతా మధుకు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారం కోసం శనివారం ఆయన చర్ల మండలం పులిగుండాల గ్రామానికి వెళ్లారు. గ్రామంలో ప్రచారం చేస్తుండగా సర్పంచ్  సోడె చలపతి ఆధ్వర్యంలో ఆదివాసీలు ఆయనను అడ్డుకున్నారు. మీరేం చేశారని మాట్లాడటానికి వచ్చారని నిలదీశారు. రైతుబంధు వందల ఎకరాలు ఉన్న వాళ్లకే ఇస్తున్నారని, గిరిజనులకు ఇచ్చే సబ్సిడీలను ప్రభుత్వం రద్దు చేసిందని ధ్వజమెత్తారు.

సమస్యలు చెప్పుకునేందుకు వీల్లేకుండా ధర్నా చౌక్​లను సైతం ఎత్తేశారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని మధును ఆదివాసీలు నిలదీశారు. వారికి నచ్చచెప్పేందుకు మధు ప్రయత్నించినా ఆదివాసీలు వినలేదు. ఆయనతో పాటు వచ్చిన మరో ఎంపీటీసీ మాట్లాడేందుకు రాగా తాము ఓట్లేసి గెలిపిస్తే తమ సంక్షేమాన్ని వదిలేసి అటు చేరావు అంటూ మండిపడ్డారు. దీంతో బీఆర్ఎస్​ లీడర్లు తిరిగి వెళ్లారు.