వాయిదాల మీద వాయిదాలు

వాయిదాల మీద వాయిదాలు
  • పార్లమెంట్​లో కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన
  • సభా కార్యక్రమాలను అడ్డుకున్న ఎంపీలు.. 
  • పలు మార్లు వాయిదా
  • ఇండియన్​ అంటార్కిటిక్​ బిల్లుకు లోక్ సభ ఆమోదం
  • ఈ వర్షాకాల సమావేశాల్లో పాసైన తొలి బిల్లు ఇదే

న్యూఢిల్లీ: పార్లమెంట్​లో వరుసగా ఐదో రోజూ ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం, అగ్నిపథ్​ స్కీమ్​తదితర అంశాలపై ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో పలు మార్లు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అయితే మధ్యాహ్నం తర్వాత మాత్రం రెండు సభల్లో పలు బిల్లులపై చర్చ జరిగింది. లోక్​సభలో ఇండియన్​ అంటార్కిటిక్​ బిల్లు, 2022కు ఆమోదం లభించింది. ఈ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన తొలి బిల్లు ఇదే. అటు రాజ్యసభలోనూ రైట్​ టు హెల్త్​ బిల్లు,2021పై చర్చ జరిగింది.

వాయిదాల మీద వాయిదాలు

శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్​సభ ప్రారంభం కాగానే.. ప్రతిపక్ష ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వెల్​లోకి దూసుకొచ్చి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. కొన్ని వస్తువలపై జీఎస్టీని తగ్గించాలని, ధరల పెరుగుదలపై చర్చించాలంటూ డిమాండ్​ చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్​ ఓం బిర్లా కోరినా వారు పట్టించుకోలేదు. ‘‘మీరు నినాదాలు చేయడానికి వచ్చారా? లేదంటే ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభకు వచ్చారా?”అని స్పీకర్​ ప్రతిపక్ష ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభ 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి మొదలైన తర్వాతా  పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రతిపక్షాలు తమ నిరసనలను కొనసాగించాయి. దీంతో సభ 2 గంటల వరకు వాయిదా పడింది. 2 గంటలకు సభ తిరిగి మొదలయ్యాక ఇండియన్​అంటార్కిటిక్​ బిల్లు, 2022పై ప్రతిపక్షాల నిరసనల మధ్యే చర్చ జరిగింది. బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఒప్పందాలను మన చట్టాల ద్వారా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల దేశంలోని తీరప్రాంత నగరాలు వరద ప్రభావానికి గురవుతున్నాయని, అంటార్కిటిక్‌‌‌‌పై గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని అర్థం చేసుకోవడం దేశానికి, ప్రపంచానికి కీలకమని చెప్పారు. బీజేడీ ఎంపీ భర్తృహరి మహతాబ్.. అంటార్కిటిక్ పర్యావరణం, దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక పరిస్థితిని అంటార్కిటికాతో పోల్చారు. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించాలని పట్టుబట్టారు. ప్రతిపక్షాల నిరసనల మధ్యే ఇండియన్​ అంటార్కిటిక్ బిల్లును లోక్​సభ ఆమోదించింది. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. 

మధ్యాహ్నం రైట్​ టు హెల్త్​ బిల్లుపై చర్చ

రాజ్యసభలోనూ సేమ్​ సీన్లే కనిపించాయి. సభ మొదలవ్వగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ఎంపీల నిరసనల మధ్యే క్వశ్చన్​ అవర్​ కొనసాగింది. వ్యవసాయం, రైల్వేస్, డెయిరీ ఫార్మింగ్, ఫార్మా తదితర రంగాలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇచ్చారు. నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో సభను 2.30 వరకు వాయిదా వేశారు. సభ తిరిగి మొదలైన తర్వాత ప్రైవేట్​ మెంబర్స్​ బిల్లులను ప్రవేశపెట్టారు. ఎంపీ మనోజ్​ కుమార్​ ఝా రైట్​ టు హెల్త్​ బిల్లుపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో 2025 నాటికి ప్రతి వెయ్యి మంది జనాలకు ముగ్గురు డాక్టర్లు ఉంటారని బీజేపీ ఎంపీ రాకేశ్​ సిన్హా అన్నారు. కరోనా సమయంలో కేంద్రం తీరును కాంగ్రెస్​ ఎంపీ రజనీ అశోక్​రావు తప్పుబట్టారు. దీని స్ఫూర్థిని అర్థం చేసుకోవాలంటూ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వీలుగా ఉభయ సభలను సోమవారం మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు.