ప్రైవేట్ కాలేజీ నిర్వాకం: స్టూడెంట్లకు తెలియకుండానే ఆప్షన్స్

ప్రైవేట్ కాలేజీ నిర్వాకం: స్టూడెంట్లకు తెలియకుండానే ఆప్షన్స్

మంచిర్యాల, వెలుగు: దోస్త్​లోని లొసుగులను ఆసరా చేసుకొని స్టూడెంట్లతో ప్రైవేటు కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. శనివారం లక్సెట్టిపేటలోని ఓ ప్రైవేట్​ మహిళా డిగ్రీ కాలేజీ నిర్వాహకులు దోస్త్​లో అప్లై చేస్తామంటూ తమను తప్పుదారి పట్టించారని నలుగురు విద్యార్థినులు ఆరోపించారు. దీంతో ప్రైవేట్​ కాలేజీల నిర్వాకం మరోసారి చర్చకు వచ్చింది. స్టూడెంట్స్ ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకొని, వారు ఏ కాలేజీలో చేరాలనుకుంటున్నారో ఫస్ట్​, సెకండ్​, థర్డ్​ ఆప్షన్స్​ ఇవ్వాలి. ఫస్ట్​ ఆప్షన్​ ఇచ్చిన కాలేజీలో సీటు రాకపోతే సెకండ్​, థర్డ్​ ఆప్షన్స్​ పెట్టుకున్న కాలేజీల్లో సీటు దక్కే అవకాశం ఉంటుంది. దరఖాస్తుతో పాటు విద్యార్థుల ఆధార్​నంబర్ లింక్​ చేయాలి. దోస్త్​లో రిజిస్టర్​ చేసిన మొబైల్​ నంబరుకు సీట్ల కేటాయింపునకు సంబంధించిన సమాచారం వస్తుంది.

ఇక్కడే కొన్ని ప్రైవేట్​ కాలేజీల నిర్వాహకులు దోస్త్​ను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. తామే దరఖాస్తు చేస్తామని చెప్పి తమ కాలేజీ మాత్రమే ఆప్షన్ గా ఇస్తున్నారు. దీంతో సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థులు తమకు ఇష్టమున్నా.. లేకున్నా ఆ కాలేజీలోనే చేరే పరిస్థితి కల్పిస్తున్నారు.‘దోస్త్ లో అప్లై చేస్తామని మా దగ్గరి నుంచి ఆధార్ నంబర్ తీసుకుని మేం చెప్పిన కాలేజీ కాకుండా వారి కాలేజీ మాత్రమే ఆప్షన్ గా పెట్టారు. ఓటీపీ కోసం కాలేజీ వాళ్ల ఫోన్ నంబర్లే పెట్టుకుని మాకు సమాచారం అందకుండా చేశారు’ అని ఓ విద్యార్థిని ఆరోపించింది. దీనిపై న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.