
వరుస విజయాలతో ఊపు మీదున్న బెంగళూరు పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ పై కన్నేసింది. అదే సమయంలో టేబుల్ బాటమ్ లో ఉన్న చెన్నై గౌరవప్రదమైన గెలుపు కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ (శనివారం మే 3) జరగనున్న మ్యాచ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్న RCB చెన్నైని ఓడించి 16 పాయింట్లతో నెం.1 పొజిషన్ లోకి వెళ్లాలని చూస్తోంది.
ఈ మ్యాచ్ కు వరుణ గండం వచ్చేలా ఉందని ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలయ్యింది. గత రెండు రోజులుగా బెంగళూరు ప్రాక్టీస్ కు వర్షంతో అంతరాయం కలుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ కూడా వాతావరణం అలాగే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏ క్షణంలోనైనా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇరు జట్ల ప్రాక్టీస్ కు వర్షం అంతరాయం కలిగించిందని ESPNcricinfo పేర్కొంది. శుక్రవారం 3 గంటలకు CSK ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా వర్షం రావడంతో కేవలం 45 నిమిషాల ప్రాక్టీస్ తో తిరుగుముఖం పట్టింది టీమ్. బెంగళూరు ప్లేయర్స్ 5 గంటలకు ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ కు వెళితే.. సేమ్ ప్రాబ్లమ్ వాళ్లే ఫేస్ చేశారు. కోహ్లీ, పడిక్కల్ 45 నిమిషాల ప్రాక్టీస్ తర్వాత ప్రాక్టీస్ సెషన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సాయంత్రం మొత్తంగా మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో స్టేడియంలో నీళ్లు నిలిచినట్లు చెబుతున్నారు.
ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై.. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి ఔట్ అయ్యింది. అదే సమయంలో బెంగళూరు టాప్ పొజిషన్ కోసం పోటీ పడుతోంది. అయితే ఇవాళ వర్షం పడితే మ్యాచ్ పరిస్థితి ఏంటనే ఆందోళన ఇరు ఫ్రాంఛేంజీలలో నెలకొంది.
కోహ్లీతో ధోనీ అడనున్న చివరి మ్యాచ్..?
చెన్నై ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించడంతో మరో నాలుగు నామమాత్ర మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో ఇవాళ బెంగళూరుతో మ్యాచ్ ఆడనుంది. ప్లే ఆఫ్స్ నుంచి వైదొలగిన చెన్నై.. మరో మ్యాచ్ బెంగళూరుతో ఆడే ఛాన్స్ ఈ సీజన్ లో లేనట్లే. సో.. మళ్లీ వచ్చే ఐపీఎల్ లోనే ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే ధోనీ ఈ సీజన్ లోనే రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకవేళ అదే జరిగితే ధోనీ, కోహ్లీతో తలపడే ఆఖరు మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నారు ఫ్యాన్స్. వచ్చే ఐపీఎల్ ఆడితేనే ఈ దిగ్గజాలు మళ్లీ ఢీకొట్టేది. లేదంటే ధోనీ రిటైర్మెంట్ కు ముందే వీళ్లు వీడ్కోలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. చూడాలి మరి.. ధోనీ మరో సీజన్ అడతాడా.. ఈ సీజన్ లోనే రిటైర్ అవుతాడా అనేది.