సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై  క్రిమినల్ కేసులు - ఎడీఆర్ రిపోర్ట్​

సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై  క్రిమినల్ కేసులు - ఎడీఆర్ రిపోర్ట్​
  • 5% మంది వద్ద 100 కోట్లకు మించి ఆస్తులు

న్యూఢిల్లీ: మన దేశంలోని 514 మంది సిట్టింగ్ ఎంపీల్లో 225 మంది (44%)పై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరో 5 శాతం మంది బిలియనీర్లుకాగా..వారి ఒక్కొక్కరి ఆస్తులు రూ.100 కోట్లకు మించి ఉన్నాయి. గతంలో ఎంపీలు సమర్పించిన అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించిన అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడీఆర్) పలు వివరాలతో రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ నివేదిక ప్రకారం.. క్రిమినల్ కేసులు నమోదైన 225 మందిలో  29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు పాల్పడటంలాంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. మొత్తం 9 మందిపై మర్డర్ కేసులు నమోదుకాగా.. వారిలో ఐదుగురు బీజేపీకి చెందినవారే. 28 మందిపై హత్యాయత్నం కేసులు నమోదైతే.. వారిలో 21 మంది బీజేపీ నేతలే.  అదేవిధంగా16 మంది సిట్టింగ్ ఎంపీలు మహిళలపై నేరాలకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇందులో 3 అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎంపీలపైనే  ఎక్కువగా క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఏడీఆర్ విశ్లేషణలో తేలింది. ఆయా రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా ఎంపీలపై క్రిమినల్ కేసులున్నాయి. 

రిచ్ ఎంపీల్లో ఫస్ట్ నకుల్ నాథ్  

జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లోనే ఎక్కువ మంది కోటీశ్వరులు ఉన్నట్లు ఏడీఆర్ తేల్చింది. అత్యంత ధనిక ఎంపీల్లో కాంగ్రెస్ కు చెందిన నకుల్ నాథ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. తర్వాతి స్థానాల్లో డీకే సురేశ్ (కాంగ్రెస్), కనుమూరు రఘురామ కృష్ణరాజు (ఇటీవల వైసీపీకి రిజైన్ చేశారు) ఉన్నారు. ఎంపీల విద్యార్హతలను కూడా ఏడీఆర్ తన నివేదికలో పేర్కొంది. 73శాతం మంది ఎంపీలు గాడ్యుయేషన్ పూర్తి చేశారని వెల్లడించింది. మొత్తం ఎంపీల్లో కేవలం 15% 
మంది మాత్రమే మహిళలు ఉన్నారని తెలిపింది.