
న్యూఢిల్లీ: జైపూర్‌కు చెందిన ఆగ్రోకెమికల్ కంపెనీ అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ తమ ఐపీఓ కోసం షేరు ధరను రూ.95–రూ.100 గా నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.193 కోట్లు సేకరించాలని చూస్తోంది. ఈ ఐపీఓ సెప్టెంబర్ 30న ప్రారంభమై అక్టోబర్ 3న ముగుస్తుంది. ఇది పూర్తిగా 1.93 కోట్ల ఈక్విటీ షేర్ల ఫ్రెష్ ఇష్యూ. అంటే ఈ ఐపీఓలో ఎలాంటి ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ఉండదు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన రూ.193 కోట్లలో, రూ.135 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మిగిలిన మొత్తాన్ని జనరల్ కార్పొరేట్ అవసరాలకు వాడతామని కంపెనీ పేర్కొంది.
అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ పంటల గ్రోత్ కోసం ఇన్సెక్టిసైడ్లు, హెర్బిసైడ్లు, ఫంగిసైడ్లు, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్లు, అలాగే మైక్రో న్యూట్రియంట్ ఫర్టిలైజర్లు, బయోఫర్టిలైజర్ల వంటివి ఉత్పత్తి చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి కార్యకలాపాల ద్వారా రూ.502 కోట్ల ఆదాయం రాగా, రూ.25.6 కోట్ల నికర లాభాన్ని పొందింది. ఈ ఐపీఓకి చాయిస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రధాన బుక్ -రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది.