ఏటీసీల్లో హైటెక్ కోర్సులు..సాంకేతిక విద్యకు దీటుగా రియల్ టైం ప్రాక్టికల్ ట్రైనింగ్

ఏటీసీల్లో హైటెక్ కోర్సులు..సాంకేతిక విద్యకు దీటుగా రియల్ టైం ప్రాక్టికల్ ట్రైనింగ్
  • ఐటీఐల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు
  • వరంగల్ లో ఓపెనింగ్ కు సిద్ధమైన రెండు సెంటర్లు
  • ప్రారంభమైన వాక్ ఇన్ అడ్మిషన్లు.. 28 వరకు ఛాన్స్

హనుమకొండ, వెలుగు: పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్, ఎంటెక్ తరహలో సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేస్తున్నది. వాటి ద్వారా రోబోటిక్స్ లాంటి అత్యాధునిక మెషినరీతో ట్రైనింగ్ ఇవ్వనుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఇదివరకే ఏటీసీలను ప్రారంభించగా.. ఈ నెల నుంచి హనుమకొండ, వరంగల్ లో ప్రారంభిస్తున్నారు. ఐటీఐలో ఫస్ట్, సెకండ్ ఫేజ్ అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ఐటీఐలలో కొనసాగుతున్న వాక్ ఇన్ అడ్మిషన్ల ప్రక్రియలోనే ఏటీసీల్లోనూ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ ఏడాది నుంచే స్టూడెంట్లకు అత్యాధునిక టెక్నాలజీతో రియల్ టైం ప్రాక్టికల్ ట్రైనింగ్ అందనుంది.

రూ.5 వేల కోట్లతో ఏటీసీలు.. 

నిర్వీర్యమవుతున్న ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టాటా టెక్నాలజీస్ కంపెనీ సహకారంతో రాష్ట్రంలో మూడు విడతల్లో 111 ఏటీసీలు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. మొదటి విడతలో 25 సెంటర్లు ఓపెన్ చేయగా.. రెండో విడతలో ఈ ఏడాది 45 సెంటర్లు ప్రారంభిస్తున్నది. ఇవికాక మరో 46 ఏటీసీలను మూడోవిడతలో ఏర్పాటు చేయనుంది.

బిల్డింగ్, లేటెస్ట్ ఎక్విప్మెంట్, రోబోటిక్ పరికరాల కోసం ఒక్కోదానికి రూ.45 కోట్ల చొప్పున మొత్తం రూ.5 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. హనుమకొండ, వరంగల్ జిల్లాల ఏటీసీలను వరంగల్ ఐటీఐ కాంపౌండ్ లో నిర్మిస్తున్నారు. బిల్డింగ్ పనులు పూర్తికాగా.. ల్యాబ్ ఎక్విప్మెంట్ చేరుకుంది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. సీసీ రోడ్డు తదితర సివిల్ వర్క్స్ జరగాల్సిఉంది. ఈ పనులు నెల రోజుల్లో పూర్తవుతాయి. కాగా, కాజీపేట ఐటీఐలో స్థలం లేకపోవడంవల్ల వరంగల్​ ఐటీఐలోనే నిర్మించాలని నిర్ణయించారు. 

అడ్వాన్స్డ్ కోర్సులు.. రియల్ టైం ప్రాక్టికల్స్

 మామూలు ట్రేడ్స్​తో పాటు ఏటీసీల్లో ఆరు అడ్వాన్స్డ్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఒక్కో ఏటీసీలో 172 సీట్లు ఉంటాయి. కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మెషినింగ్ టెక్నిషియన్ 24 సీట్లు, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్ 20, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్షరింగ్ టెక్నిషియన్ 40, మాన్యుఫాక్షరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నిషియన్ 40, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్ 24, వర్చువల్ అనాలసిస్ అండ్ డిజైనర్ కోర్సుల్లో 24 సీట్లున్నాయి. ఈ కోర్సుల నిర్వహణ కోసం టాటా టెక్నాలజీస్ సిబ్బందితో పాటు ఐటీఐల్లోని స్టాఫ్ కు ట్రైనింగ్ ఇచ్చారు.

వివిధ దేశాల నుంచి తెప్పించిన మెషినరీలు, రోబోటిక్ యంత్రాలతో విద్యార్థులకు రియల్ టైం ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఏటీసీల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. స్వయం ఉపాధికి కూడా మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఐటీఐలో రెండు విడతల అడ్మిషన్​ ప్రాసెస్​ పూర్తి అయ్యింది. మిగిలిపోయిన సీట్లతో పాటు వరంగల్, హనుమకొండ ఏటీసీల్లో ప్రవేశాల కోసం అధికారులు వాక్ ఇన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 6 నుంచి 28 వరకు స్పాట్ అడ్మిషన్లు తీసుకుని, తరగతులు స్టార్ట్ చేయనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.