‘ఇన్‌‌‌‌ఫ్లుయెంజా’ విషయంలో ఎక్స్‌‌‌‌పర్టుల సూచనలు

‘ఇన్‌‌‌‌ఫ్లుయెంజా’ విషయంలో ఎక్స్‌‌‌‌పర్టుల సూచనలు
  • కేసులు భారీగా పెరిగే చాన్స్ ఉండకపోవచ్చని వెల్లడి
  • కరోనా టైంలో పాటించిన ప్రికాషన్స్‌‌‌‌ను కొనసాగిస్తే సరిపోతుందని సలహా

న్యూఢిల్లీ: కరోనా పీడ విరగడైందనుకుంటే.. కొత్తగా ‘ఇన్‌‌‌‌ఫ్లుయెంజా’ భయపెడుతోంది. ఎన్నడూ లేనిది ఈ ఏడాది కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ‘హెచ్‌‌‌‌3ఎన్‌‌‌‌2’ కారణంగా దేశంలో ఇద్దరు చనిపోవడంతో కరోనా మాదిరి ఈ వైరస్ కూడా వ్యాపిస్తుందా? అనే ఆందోళన ప్రజల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో ఇన్‌‌‌‌ఫ్లుయెంజా వైరస్‌‌‌‌పై ఆందోళన చెందాల్సిన పని లేదని మెడికల్ ఎక్స్‌‌‌‌పర్టులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్త అవసరమని పేర్కొంటున్నారు.

ఆసుపత్రుల్లో చేరుతున్నది 5 శాతమే 

కేసులు భారీగా నమోదవుతాయని అనుకోవడం లేదని అశోకా విశ్వవిద్యాలయంలోని త్రివేది స్కూల్ ఆఫ్ బయోసైన్సెస్ డీన్, పల్మనాలజిస్ట్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. ‘‘రెగ్యులర్ ఫ్లూతో పోలిస్తే.. హెచ్‌‌‌‌3ఎన్‌‌‌‌2 కాస్త తీవ్రంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మరణానికి దారితీయొచ్చు. అయితే ఫ్లూను ఎదుర్కొనేందుకు అవసరమైన రోగనిరోధక శక్తి మన దగ్గర ఉంది. వ్యాక్సిన్‌‌‌‌లు కూడా ఉన్నాయి. అందుకే భారీ వేవ్ వస్తుందని నేను అనుకోవడం లేదు” అని చెప్పారు. అయితే ఫ్లూ వ్యాప్తి విషయంలో నిఘా, పర్యవేక్షణ చాలా ముఖ్యమని చెప్పారు. ‘‘2023 ప్రారంభమైనప్పటి నుంచి హెచ్‌‌‌‌3ఎన్‌‌‌‌2 కేసులు పెరుగుతున్నాయి. సాధారణంగా ఏటా నమోదయ్యే సంఖ్య కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఫ్లూ కారణంగా ఆసుపత్రుల్లో చేరుతున్న వాళ్ల సంఖ్య పెద్దగా లేదు. కేవలం 5% మంది మాత్రమే చికిత్స కోసం చేరారు. ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే జాగ్రత్త పడాలి. కరోనా సమయంలో తీసుకున్న ప్రికాషన్స్‌‌‌‌ను ఇప్పుడు కొనసాగిస్తే సరిపోతుంది” అని అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ తరుణ్ సహానీ తెలిపారు.

పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు

ఓవైపు ఇన్‌‌‌‌ఫ్లుయెంజా కేసులు ఆందోళన కలిగిస్తుండగా.. మరోవైపు కరోనా పాజిటివిటీ రేటు పెరుగుతుండటం కలవరపెడుతోంది. పలు రాష్ట్రాల్లో టెస్టింగ్ పాజిటివిటీ రేటు ఎక్కువవుతోందని, అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. ఇన్‌‌‌‌ఫ్లుయెంజా -లాంటి అనారోగ్యం (ఐఎల్‌‌‌‌ఐ) లేదా తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌‌‌‌ఫెక్షన్ (సారి) కేసులపై సమగ్ర సర్వైలెన్స్ కోసం తాము జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. ఆసుపత్రుల్లో మందులు, మెడికల్ ఆక్సిజన్ అవసరమైనంత మేర స్టాక్ ఉందా లేదా చూసుకోవాలని చెప్పింది.శనివారం ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ లెటర్ రాశారు.

ఈ జాగ్రత్తలు పాటించాలి

  •     ఇంట్లో నుంచి బయటికి వచ్చినపుడు మాస్క్ ధరించాలి. రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలి.
  •     దగ్గినపుడు, తుమ్మినపుడు ముక్కుతో పాటు నోటిని కవర్ చేసుకోవాలి.
  •     చేతులతో కళ్లు, ముక్కును పదేపదే తాకొద్దు. వైరస్ వ్యాప్తికి ఇది కారణమయ్యే అవకాశం ఉంది.
  •     జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే డాక్టర్ల సూచన ప్రకారమే మందులు వాడాలి.
  •     షేక్​హ్యాండ్ ఇవ్వొద్దు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయొద్దు.
  •     డాక్టర్ల సూచన లేకుండా యాంటీబయాటిక్ మందులు వాడొద్దు.
  •     గ్రూప్ గా కూర్చుని భోజనం చేయొద్దు.