2020లో మర్డర్​కు ప్లాన్​

2020లో మర్డర్​కు ప్లాన్​
  • ​​​​​​కర్నూలు గ్యాంగ్​కు అప్పగింత
  • ఆదివారం మరో ఆరుగురి అరెస్ట్​ చూపిన ఎస్పీ

ములుగు, వెలుగు: సంచలనం సృష్టించిన అడ్వకేట్​మల్లారెడ్డి హత్యకు భూవివాదాలే కారణమని  ములుగు ఎస్పీ డాక్టర్ ​సంగ్రాంసింగ్ జి.పాటిల్ ప్రకటించారు. ఇందుకోసం  రూ.18 లక్షల సుపారీ ఇచ్చి కర్నూల్ ​గ్యాంగ్​తో హతమార్చినట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన వరంగల్​ జిల్లా నర్సంపేటకు చెందిన గోనెల రవీందర్, హనుమకొండకు చెందిన పిండి రవియాదవ్​, వంచ రాంమోహన్​ రెడ్డితోపాటు హత్యలో పాల్గొన్న తడక రమేశ్​ను శనివారం కోర్టులో హాజరు పరిచి రిమాండ్​కు తరలించగా మరో ఆరుగురు నిందితులను ఆదివారం ఎస్పీ సమక్షంలో పోలీసులు అరెస్ట్​ చూపారు.  ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. లాయర్​ మూలగుండ్ల మల్లారెడ్డిని హత్య చేసేందుకు 2020లోనే  పథకం రచించారు. మృతుడు మూలగుండ్ల మల్లారెడ్డికి,  గోనెల రవీందర్, పిండి రవియాదవ్, వంచ రాంమోహన్​ రెడ్డి టీమ్​మధ్య కొన్నేళ్లుగా పలు ఏరియాల్లో ల్యాండ్​ ఇష్యూస్​ఉన్నాయి. మల్లారెడ్డిని హతమారిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని భావించిన ప్రధాన నిందితులు..  గోనెల రవీందర్​ అనుచరుడు ఆర్ఎంపీ తడక రమేశ్​ను సంప్రదించారు. రమేశ్, శాయంపేట మండలం గంగిరేణి గూడెంకు చెందిన పెరుమాండ్ల రాజు కలిసి కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ఈడిగ జయరాం, ఈడిగ వేణు, బుక్కా వెంకటరమణతో మర్డర్​ప్లాన్​ చేశారు. ఇందుకోసం ప్రధాన నిందితులకు రూ.18 లక్షల సుపారీ ఇచ్చేందుకు అగ్రిమెంట్​చేసుకున్నారు. హత్యలో జయరాం, వేణు, వెంకటరమణతో పాటు నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన వైనాల శివ, గంగిరేణిగూడెంకు చెందిన పెరుమాండ్ల రాజు కూడా పాల్గొన్నారు.  మల్లారెడ్డిని హత్య చేసేందుకు సరైన సమయం కోసం ఈ సుపారీ గ్యాంగ్ రెండేళ్లపాటు ఎదురుచూసింది. ఆగస్టు 1న ములుగు మండలం పందికుంట స్టేజీ వద్ద పక్కా స్కెచ్​ప్రకారం మల్లారెడ్డి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టారు. మాట్లాడేందుకు దిగిన మల్లారెడ్డిని రోడ్డుపక్కన చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.

దాడి సమయంలో ప్రతిఘటించిన మల్లారెడ్డి ఈడిగ జయరాంను కత్తితో గాయపరిచాడు. హంతకుల దాడిలో తీవ్ర గాయాలైన మల్లారెడ్డి స్పాట్ లోనే చనిపోయాడు. విషయాన్ని రూఢీ చేసుకున్న అనంతరం నిందితులు కారులో పరారయ్యారు. శనివారం సాయంత్రం పక్కా సమాచారం మేరకు నారక్కపేటలోని తడక రమేశ్​ క్లినిక్​ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సంగ్రాంసింగ్​ తెలిపారు. లాయర్ మర్డర్​ కేసులో నిందితులను అరెస్ట్​ చేసిన పోలీసులు ఈ హత్యతో మరికొందరికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. నిందితులను జ్యుడిషియల్​ కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఓఎస్డీ గౌస్​ ఆలం, ములుగు ఏఎస్పీ సుధీర్​ రాంనాథ్​ కేకన్​, సీఐ జి.శ్రీధర్, ఎస్సై బి.ఓంకార్​యాదవ్​ను ఎస్పీ అభినందించారు.