న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి ..అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి ..అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, వెలుగు: న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్​ తెలిపారు. గురువారం వికారాబాద్ లో నిర్వహించిన బార్​అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరై, మాట్లాడారు. వికారాబాద్ కోర్టు సముదాయం పక్కన గల ఇరిగేషన్ ఆఫీస్​స్థలాన్ని కోర్టులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. వారం, పది రోజుల్లో కొత్త భవన నిర్మాణానికి ఫౌండేషన్​వేసేలా చూస్తానని పేర్కొన్నారు. 

అవసరమైతే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్​రెడ్డిని తీసుకువస్తానని చెప్పారు. జిల్లాలోని జూనియర్ న్యాయవాదులకు ఎక్కువ స్టైఫండ్ వచ్చేలా, న్యాయవాదులకు ఇండ్ల స్థలాలు పంపిణీపై కలెక్టర్​తో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. అంతకుముందు డాక్టర్ అనిల్ కుమార్ పాటిల్, డాక్టర్ అశ్విని పాటిల్ దంపతులు ఏర్పాటు చేసిన ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ డెంటల్​హాస్పిటల్​ను స్పీకర్ ప్రారంభించారు. 

వికారాబాద్ ప్రజలకు సేవా దృక్పథంతో తక్కువ వ్యయంలో దంత వైద్య సేవలందించాలని సూచించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్​ఎన్.బస్వరాజ్, ప్రధాన కార్యదర్శి వెంకట్​రెడ్డి, ఉపాధ్యక్షుడు శంకరయ్య, సీనియర్​న్యాయవాదులు గోవర్ధన్​రెడ్డి, యాదవరెడ్డి, సంపూర్ణ ఆనంద్, శుభప్రద్ పటేల్, నాగరాజు, వసుంధర, ఆనంద్​తదితరులున్నారు.