హైదరాబాద్ గాలిలో ఏరోసోల్స్ డేంజర్ బెల్స్.. ఏరోసోల్స్ అంటే ఏంటి ..?

హైదరాబాద్ గాలిలో ఏరోసోల్స్ డేంజర్ బెల్స్.. ఏరోసోల్స్  అంటే ఏంటి ..?
  •     ఇరవై ఏండ్లలో 45 శాతం పెరుగుదల 
  •     సీజన్‌‌తో సంబంధం లేకుండా వాతావరణంలో పెరిగిన     ఏరోసోల్స్‌‌
  •     ఎన్‌‌ఐటీ తిరుచురాపల్లి స్టడీలో వెల్లడి

హైదరాబాద్‌‌లో రోజురోజుకు పొల్యూషన్‌‌ పెరుగుతున్నది. దీంతో గాలిలో కాలుష్యకారక ఏరోసోల్స్‌‌ భారీ స్థాయిలో విస్తరిస్తున్నాయి. సమ్మర్‌‌‌‌, వింటర్‌‌‌‌ అన్న తేడా లేకుండా వీటి గాఢత తీవ్రమవుతున్నది. గత 20 ఏండ్లలో 45 శాతం మేర ఏరోసోల్స్ కాన్‌‌సంట్రేషన్ (గాఢత) పెరిగింది. నేషనల్‌‌ ఇన్‌‌స్టిట్యూషన్‌‌ ఆఫ్‌‌ టెక్నాలజీ (ఎన్‌‌ఐటీ) తిరుచురాపల్లి సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్​కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అనీశ్ మాథ్యూ, పడాల రాజశేఖర్, నందన్ ఏకే కలిసి చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 

2000 నుంచి 2022 మధ్య వాతావరణంలోని ఏరోసోల్స్ కాన్‌‌సంట్రేషన్ డేటాను ఏరోసోల్ ఆప్టికల్ డెప్త్ (ఏవోడీ) వివరాలను విశ్లేషించింది. గాలిలో ఏవోడీ లెవెల్స్ ప్రస్తుతం 0.7గా ఉన్నట్టు స్టడీ తేల్చింది. 2002లో నమోదైన దానితో పోలిస్తే ఇది 45 శాతం అధికమని తెలిపింది. 2018 నుంచి 2021 మధ్య ఈ ఏరోసోల్స్ గాఢత అధికమైందని తేల్చింది. అయితే, చలికాలంలో కాలుష్యకారక ఏరోసోల్స్ మరింత పెరుగుతున్నాయని తెలిపింది.

 ఈ 20 ఏండ్లలో చలికాలంలో అత్యధికంగా ఏరోసోల్స్ గాలిలో పేరుకుపోతున్నాయని, దీంతో దాని తీవ్రత 49 శాతం పెరిగిందని స్టడీలో వెల్లడించింది. ఎండాకాలంలో కూడా 44 శాతం మేర పెరిగినట్టు వివరించింది. ఓవరాల్‌‌గా ఒక ఏడాదిని పరిగణనలోకి తీసుకుంటే వాతావరణంలో 45 శాతం మేర ఏరోసోల్స్ తీవ్రత పెరిగినట్లు తెలిపింది. కొన్నేండ్లు ఎండాకాలంలో కాలుష్యకారక ఏరోసోల్స్ కాన్సంట్రేషన్ చాలా అధికంగా ఉన్నట్టు గుర్తించామని రీసెర్చర్లు పేర్కొన్నారు. 

ఏరోసోల్స్​అంటే. ..

సాలిడ్ (ఘన) లేదా లిక్విడ్ (ద్రవ) రూపంలో పదార్థాలు కలిపి గ్యాస్‌‌లా ఉండే వాటినే ‘ఏరోసోల్స్’(బాడీ స్ప్రే లాంటివి) అంటారు. గాలిలో ఉన్న ఏరోసోల్స్​లో కాలుష్య కారకాలైన పీఎం 2.5, పీఎం 10 కలిసి వాటి గాఢతను మరింత పెంచుతున్నాయని స్టడీ పేర్కొంది. వీటి తీవ్రత పెరగడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్, వేడిని ఏరోసోల్స్ శోషించుకోవడంతో వాతావరణంలో వీటి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

 వాటి గాఢత ఇంకా పెరిగితే ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏరోసోల్స్ గాఢత 0 నుంచి 0.5 మధ్య ఉంటేనే దాని ప్రభావం మధ్యస్థంగా ఉంటుందని, ఆ మోతాదు దాటితే అధికంగా ఉంటుందని  పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో ఏరోసోల్స్ గాఢత 0.7గా ఉన్నట్టు తెలిపింది. వాటిని పీల్చుకుంటే లంగ్స్ పాడయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, గుండెజబ్బుల ముప్పు కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

కాలుష్యం పెరగడమే కారణం..

రోజురోజుకు వాహనాలు పెరగడంతో కాలుష్యం ఎక్కువవుతుందని, దీంతో పీఎం 2.5, పీఎం 10 స్థాయిలు పెరుగుతున్నాయని రీసెర్చర్లు చెబుతున్నారు. పీఎం స్థాయిలు పెరగడం వల్లే వాతావరణంలో ఏరోసోల్స్ తీవ్రత ఎక్కువగా నమోదవుతున్నదని పేర్కొన్నారు. ప్రస్తుత స్టడీలోనూ ఈ విషయాన్ని రీసెర్చర్లు గుర్తుచేశారు. 2022లో నమోదైన పీఎం 2.5 స్థాయిలు డబ్ల్యూహెచ్‌‌వో నిర్ధారించిన స్థాయిల కన్నా 15.2 రెట్లు ఎక్కువగా ఉందన్నారు. మరోవైపు, 2021లో 12 వేల మంది వాయు కాలుష్యం వల్ల చనిపోయారని రీసెర్చర్లు వెల్లడించారు. అందుకే హైదరాబాద్‌‌ను ఈ స్టడీ కోసం ఎంచుకున్నామని తెలిపారు.