వరద బాధితుల అఫిడవిట్ అరకొర సమాచారమే: హైకోర్టు ఫైర్

వరద బాధితుల అఫిడవిట్ అరకొర సమాచారమే:  హైకోర్టు ఫైర్
  • చనిపోయినోళ్ల, గల్లంతైనోళ్ల వివరాలు లేవని ఆగ్రహం 
  • పూర్తి వివరాలతో పాటు శాశ్వత నివారణ చర్యలపై వేర్వేరు అఫిడవిట్లు వేయాలని ఆదేశం 
  • 1.60 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సర్కార్ రిపోర్టు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లో అరకొర సమాచారమే ఉందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్ లో చనిపోయినోళ్ల, గల్లంతైనోళ్ల వివరాలేవీ లేవని ఫైర్ అయింది. ‘‘వరదల్లో కొట్టుకుపోయినోళ్ల వివరాలు ఇవ్వలేదు. ఆ వివరాలన్నీ ఇవ్వండి. గల్లంతైన తమవాళ్ల గురించి కుటుంబసభ్యులు తెలుసుకునేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయండి” అని సర్కార్ ను ఆదేశించింది. అఫిడవిట్ లో అంకెలు తప్ప, మృతుల వివరాలు లేవని.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చనిపోయినోళ్ల వివరాలను ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించింది. 

జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ చెరుకు సుధాకర్‌‌ దాఖలు చేసిన పిల్‌‌ పై హైకోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. ‘‘వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై పూర్తి వివరాలు ఇవ్వండి. ప్రాణ, ఆస్తి, జంతు నష్టంపై గ్రామాల వారీగా వివరాలు అందజేయండి. కలెక్టర్ల సర్వే రిపోర్టులను ఇవ్వండి. మీరిచ్చిన రిపోర్టులో దెబ్బతిన్న ప్రాంతాల పునరుద్ధరణకు తీసుకున్న చర్యల గురించి లేనేలేదు. 

వరద బాధితులను ఆదుకున్నారా? కడెం ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామాల ప్రజల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పాడైపోయిన రోడ్లు, కరెంట్ పోల్స్, ఫోన్, ఇంటర్ నెట్ వ్యవస్థలను పునరుద్ధరించారా? అసలు మీరు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? భవిష్యత్తులో ఇలాంటివి తలెత్తకుండా శాశ్వత నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వీటిపై వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయండి” అని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

వరదల వల్ల నిరాశ్రయులైన 14 వేల మందికి పైగా బాధితులకు నిరంతరం సేవలు అందించాలని, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ టి.వినోద్‌‌ కుమార్​తో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసింది. 

కంటితుడుపు తరహాలో రిపోర్టు.. 
తొలుత పిటిషనర్‌‌ తరఫు లాయర్ చిక్కుడు ప్రభాకర్‌‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులకు, ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌‌లోని అంశాలకు ఎక్కడా పొంతన లేదు. జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు చనిపోతే ప్రభుత్వం కనీసం రిపోర్టులో ప్రస్తావించలేదు. ప్రభుత్వం కంటితుడుపు తరహాలో రిపోర్టు ఇచ్చింది. వర్షాలు, వరదలపై కేంద్రం ముందే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. దీంతో జనం తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. 

ఊళ్లకు ఊళ్లు మునిగిన ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం హెలికాప్టర్ పంపలేదు. కడెం ప్రాజెక్టు గేట్ల పైనుంచి వరద వస్తోంది. ఆ ప్రాజెక్టు తెగిపోతే దిగువన ఉన్న 178 గ్రామాలు మునిగిపోతాయి” అని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్‌‌ పరిషద్‌‌ స్పందిస్తూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. వరద బాధితులకు సాయం చేసేందుకు ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు పూర్తి వివరాలు అందజేస్తామన్నారు. 

57,688 మంది రైతులకు నష్టం.. 
వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. 1,59,960 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అందులో పేర్కొంది. 57,688 మంది రైతులు నష్టపోయారని తెలిపింది. ‘‘240 ఇండ్లు పూర్తిగా.. 6,443 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 190 చెరువులకు గండ్లు పడ్డాయి. 168 రోడ్లు దెబ్బతిన్నాయి” అని చెప్పింది.