ఏంటన్నా ఆ స్పీడ్.. ఎక్కడైనా తగిలితే: పసికూన జట్టుపై పాక్ బౌలర్ల ప్రతాపం

ఏంటన్నా ఆ స్పీడ్.. ఎక్కడైనా తగిలితే: పసికూన జట్టుపై పాక్ బౌలర్ల ప్రతాపం

ఆసియా కప్ 2023 సన్నద్ధతను దాయాది పాకిస్తాన్ జట్టు ఘనంగా ఆరంభించింది. మంగళవారం అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్.. 142 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 201 పరుగుల నామమాత్రపు స్కోరును అఫ్ఘాన్ బ్యాటర్లు చేధించలేకపోయారు. నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ.. 59 పరుగులకే ఆలౌట్ అయ్యారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 47.1 ఓవర్లలో 201 పరుగులు మాత్రమే చేసింది. అది నుంచే ఆఫ్ఘన్‌ స్పిన్నర్లు.. పాక్ బ్యాటర్లపై పెత్తనం చెలాయించారు. ముఖ్యంగా ముజీబ్‌ పాక్‌ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఫకార్ జమాన్(2) పరుగులకే పెవిలియన్ చేరగా..   బాబర్‌ ఆజమ్‌(0), మహమ్మద్ రిజ్వాన్(22)లు వెంటవెంటనే ఔటయ్యారు. ఆ సమయంలో ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (61).. ఇఫ్తికార్‌ అహ్మద్‌ (30), షాదాబ్‌ ఖాన్‌ (39)ల జట్టును ఆదుకున్నారు. 

అనంతరం 202 పరుగుల లక్ష్య చేధనకు దిగిన అఫ్ఘనిస్తాన్‌ 59 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 19.2 ఓవర్లలోనే అఫ్ఘాన్ ఇన్నింగ్స్ ముగిసింది. 18 పరుగులు చేసిన రహ్మనుల్లా గుర్భాజ్ జట్టులో టాప్ స్కోరర్. అఫ్ఘాన్ బ్యాటర్లలో నలుగురు డకౌట్ కావడం గమనార్హం.

భయపెట్టిన హ్యారిస్ రౌఫ్

పాక్ పేసర్ హ్యారిస్ రౌఫ్ స్పీడ్‌కు అఫ్ఘాన్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు. గంటకు 150 కి.మీ. వేగంతో దూసుకొస్తున్న బంతులను ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఎక్కడ తగులుతుందో  అన్న భయంతో ఆచి తూచి ఆడారు. ఈ మ్యాచ్‌లో హ్యారిస్ ఐదు వికెట్లు తీసుకోగా.. షాహీన్ ఆఫ్రిది 2, నసీం షా, షాదాబ్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.

ఈ విజయంతో పాక్.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.