కాబుల్ ఎయిర్ పోర్టులో దిగిన తొలి విదేశీ విమానం

కాబుల్ ఎయిర్ పోర్టులో దిగిన తొలి విదేశీ విమానం
  • తాలిబన్ల ఆక్రమణ.. దాడులతో ధ్వంసమైన ఎయిర్ పోర్టు
  • పునరుద్ధరించి రాకపోకలకు ఏర్పాట్లు చేసిన తాలిబన్ ప్రభుత్వం

కాబూల్‌ : ఆఫ్ఘనిస్తాన్ రాజధానిలోని కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చాలా రోజుల తర్వాత ఇవాళ విదేశీ విమానం ల్యాండయింది. గత ఆగస్టు 15న రాజధాని కాబుల్ ను తాలిబన్లు ఆక్రమించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘన్లందరూ దేశం విడిచివెళ్లిపోయేందుకు ప్యాసింజర్ బస్సుల కంటే దారుణమైన రీతిలో దేశంలో నుంచి బయటపడే ప్రయత్నం చేసిన ఘటనలతో కాబుల్ ఎయిర్ పోర్టు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది. కొందరు ఏకంగా కాక్ పిట్ పై.. టైర్ల మధ్యలో తాళ్లతో కట్టుకుని ప్రయాణించే యత్నంలో జారిపడి మరణించడం.. అమెరికా దళాలు వెనుదిరుగుతున్న క్రమంలో ఉగ్రవాదులు ఎయిర్ పోర్టు వద్ద ఆత్మాహుతి దాడి చేయడంతో చెలరేగిన ఘర్షణలతో కాబుల్ ఎయిర్ పోర్టు రక్తసిక్తమైంది. ఆగస్టు 30న అమెరికా దళాలు పూర్తిగా నిష్క్రమించిన తర్వాత కాబుల్ ఎయిర్ పోర్టు కుక్కలు చింపిన విస్తరికంటే దారుణంలా మారింది. 
ధ్వంసమైన కాబుల్ ఎయిర్ పోర్టును తాలిబన్లు యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేసి యధాపూర్వక స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమ పాలనలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్న తాలిబన్లు సెప్టెంబర్‌ 3 నుంచి స్థానిక విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చినా విదేశీ విమానాలేవీ కాబుల్ వైపు తొంగి చూడలేదు. ఈ నేపథ్యంలో పాక్ నుంచి తొలి విమానం సోమవారం కాబుల్ కు చేరుకుంది. ఇస్లామాబాద్‌ నుంచి తొలి పాకిస్తాన్‌ అంతర్జాతీయ ఎయిర్‌వేస్‌ (పీఐఏ) విమానం కాబూల్‌లో ల్యాండ్ కావడం హాట్ టాపిక్ అయింది. అయితే  పాక్ నుంచి వచ్చిన విమానంలో ఒక్క విదేశీ ప్రయాణికుడైనా లేడని స్థానిక మీడియా ప్రతినిధులు పెదవి విరుస్తున్నారు. పాక్ చెప్పుచేతల్లోని తాలిబన్లు ప్రపంచ దృష్టిలో పడే ప్రయత్నాల్లో పాక్ నుంచి రాకపోకలను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. తాలిబన్ల ప్రభుత్వ హయాంలో కాబుల్ వచ్చిన తొలి విదేశీ (పాకిస్తాన్) విమానంలో పదిమంది సిబ్బందితో కాబూల్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్‌ వంటి అంతర్జాతీయ సంస్థలకు చెందిన సిబ్బంది, వారి బంధువులు సుమారు వంద మంది వరకు ఇస్లామాబాద్‌ చేరేందుకు వేచి ఉన్నట్లు కాబూల్‌ విమానాశ్రయ సిబ్బంది చెబుతున్నారు.