
కాబుల్: వరుస భూకంపాలు ఆప్ఘానిస్తాన్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఆప్ఘానిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించి దాదాపు 1400 మంది చనిపోగా.. 3500 మందిపైగా గాయపడ్డారు. ఓ వైపు ఈ ఘటనలో సహయక చర్యలు కొనసాగుతుండగానే.. తాజాగా మరోసారి భూకంపం ఆప్ఘానిస్తాన్‌ను కుదిపేసింది.
మంగళవారం (సెప్టెంబర్ 2) తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రత నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం.. నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ నగరానికి ఈశాన్యంగా 34 కిలోమీటర్లు (21 మైళ్ళు) దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. ఇటీవల1,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన భూకంపం కేంద్రానికి దగ్గరగానే తాజా భూకంప కేంద్రం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది.
భూమి కంపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఇండ్ల నుంచి బయటకు పరుగులు చేశారు. భూకంపం నేపథ్యంలో ఆప్ఘానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం అప్రమత్తమై వెంటనే సహయక చర్యలు చేపట్టింది. తాజా భూకంపంతో చోటు చేసుకున్న ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
►ALSO READ | పాక్‌తో ఫ్యామిలీ బిజినెస్ కోసమే ట్రంప్ భారత్‌ను పక్కన పెట్టాడు: జేక్ సుల్లివన్
పాకిస్తాన్-ఆప్ఘానిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని మారుమూల పర్వత ప్రాంతాలలో ఆదివారం అర్ధరాత్రి 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. వరుసగా ఐదు చోట్ల భూమి కంపించింది. ఈ ఘటనలో 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 3500 మందికి పైగా గాయపడ్డారు. పెద్ద పెద్ద భవనాలు నేలమట్టం అయ్యాయి. ఘటన స్థలంలో ప్రభుత్వం సహయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి భారీ భూకంపం ఆప్ఘాన్‌ను కుదిపేసింది.