చార్మినార్ అందాలకు ఆఫ్రికన్ అతిథులు ఫిదా

చార్మినార్ అందాలకు ఆఫ్రికన్ అతిథులు ఫిదా
  • సాలార్​జంగ్ మ్యూజియం,గోల్కొండ కోట సందర్శన
  • హైదరాబాద్‌‌‌‌ సిటీ అందాలను కెమెరాల్లో బంధించిన డెలిగేట్స్​

హైదరాబాద్, వెలుగు: చార్మినార్ అందాలకు ఆఫ్రికన్ అతిథులు ముగ్ధులయ్యారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆఫ్రికా ఖండంలోని మధ్య, పశ్చిమ ఆఫ్రికన్ దేశాల కంటెంట్ క్రియేటర్లు హైదరాబాద్‌‌‌‌కు వచ్చారు. సోమవారం సిటీలోని చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండ కోటను సందర్శించారు. ప్రొఫెసర్ సాయి గైడ్‌‌‌‌గా వ్యవహరించారు. చార్మినార్‌‌‌‌లోకి వెళ్లి గంటసేపు గడిపారు. మొదటి అంతస్తు నుంచి చార్మినార్‌‌‌‌, నగర అందాలను వీక్షించడంతో పాటు నిర్మాణ నేపథ్యం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

తమ కెమెరాల్లో చార్మినార్ అందాలను ఫొటో తీసుకున్నారు.. అనంతరం సాలార్ జంగ్ మ్యూజియానికి వెళ్లారు. మ్యూజియంలోని ఆ కాలానికి చెందిన వస్తువులు, ఫర్నీచర్, శిల్పాలు, చిత్రలేఖనాలు, లిఖిత ప్రతులు, పింగాణి వస్తువులు, వస్త్రాలు, గడియారాలు, ఏనుగు దంతాల కళాకృతులు, లోహపు పరికరాలు, భారతీయ కళలు, యూరోపియన్ పెయింటింగ్స్, మిడిల్ ఈస్టర్న్ పురాతన వస్తువులు, ఓరియంటల్ కళాఖండాలను తిలకించారు. మ్యూజికల్‌‌‌‌ క్లాక్‌‌‌‌ను చూసి అబ్బురపడ్డారు.

తర్వాత అక్కడి నుంచి గోల్కొండ కోటకు వెళ్లారు. అప్పటికే చిరుజల్లులు కురుస్తున్నా.. కోట అందాలను అతిథులు ఆసక్తిగా వీక్షించారు. కాగా, ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా కంటెంట్ క్రియేటర్ యోవానీ నాయుడు ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యువతి తండ్రి తెలుగు వ్యక్తి కాగా, తల్లి తమిళనాడు. వారి పూర్వీకులు శతాబ్దాల క్రితం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. వెస్ట్రర్న్‌‌‌‌, ట్రెడిషన్ సంగీతాన్ని మేళవిస్తూ మ్యూజిక్, కల్చర్, లాంగ్వేజ్‌‌‌‌ను ఆమె ప్రమోట్ చేస్తున్నారు.