ఉగ్ర ముల్లును పీకి పారేస్తం.. నేరుగా పోరాడే సత్తా లేక.. టెర్రరిజాన్నే వార్ స్ట్రాటజీగా పాక్ మార్చుకుంది: మోదీ

ఉగ్ర ముల్లును పీకి పారేస్తం.. నేరుగా పోరాడే సత్తా లేక.. టెర్రరిజాన్నే వార్ స్ట్రాటజీగా పాక్ మార్చుకుంది: మోదీ
  • శాంతిని కోరుకుంటాం.. కానీ ఉగ్రదాడులు చేస్తే బుద్ధి చెప్తాం 
  • అప్పుడు పటేల్ మాట విని ఉంటే.. ఈ దాడులుండేవి కాదన్న ప్రధాని
  • గుజరాత్​లో రెండోరోజు టూర్​

గాంధీనగర్: భారత్​తో నేరుగా పోరాడే సత్తా లేక పాకిస్తాన్ టెర్రరిజాన్నే యుద్ధ వ్యూహంగా మార్చుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. పొరుగుదేశం అనుసరిస్తున్న ఉగ్రవాద ‘వార్ స్ట్రాటజీకి’ తగిన విధంగా ప్రతిస్పందన ఉంటుందన్నారు. ఎంత బలమైన శరీరాన్ని అయినా ఒకే ఒక్క ముల్లు కూడా తీవ్రంగా బాధిస్తుందన్నారు. అందుకే టెర్రరిజం అనే ముల్లును ఈ దేశం నుంచి పూర్తిగా పీకేస్తామని స్పష్టం చేశారు. గుజరాత్ లో రెండో రోజు పర్యటన సందర్భంగా మంగళవారం పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 

ఈ సందర్భంగా గాంధీనగర్​లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్​లో ప్రభుత్వానికి, టెర్రరిస్టులకు ఎలాంటి తేడా లేదని మండిపడ్డారు. టెర్రరిజానికి నిరంతరం అండగా ఉంటూ పొరుగుదేశం యుద్ధానికి తెగబడుతోందన్నారు. ‘‘వసుధైక కుటుంబం అన్నది మా సంస్కారం. పొరుగువారు కూడా సంతోషంగా ఉండాలని మేం కోరుకుంటాం. కానీ మీరు మా బలాన్ని సవాల్ చేస్తే మాత్రం.. భారత్ లో వీరులకు కొదవలేదు” అని ఆయన హెచ్చరించారు. 

‘‘దీనిని ప్రాక్సీ వార్ (పరోక్ష యుద్ధం)గా భావించట్లేదు. ఎందుకంటే ఆపరేషన్ సిందూర్ లో హతమైన టెర్రరిస్టులకు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసింది. ఉగ్రవాదుల శవపేటికలపై పాక్ జెండాలను కప్పారు. మిలిటరీ సెల్యూట్ చేసింది. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్​ చూస్తుంటే.. పాక్ పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా టెర్రరిజం రూపంలోనే యుద్ధం చేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. వాళ్లు ఇలాగే టెర్రర్ యుద్ధాన్ని కొనసాగిస్తే.. అందుకు తగిన విధంగా బుద్ధి చెప్తాం” అని ప్రధాని తేల్చిచెప్పారు. అలాగే ఈసారి పక్కాగా కెమెరా ముందే పాక్​లోని టెర్రర్ క్యాంపులపై దాడి చేశామని, స్వదేశంలో ప్రూఫ్స్ అడిగేవారి నోళ్లు కూడా మూయించామన్నారు.  

 అప్పుడు పటేల్ మాట విని ఉంటే.. 

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే కాశ్మీర్​లోకి ప్రవేశించిన ముజాహిదీన్ లను మనం హతమార్చి ఉండాల్సిందని ప్రధాని మోదీ అన్నారు. అప్పుడు అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ‘‘దేశ విభజనతో భారత మాత రెండు ముక్కలు అయింది. అదే రోజు రాత్రి కాశ్మీర్ పై ముజాహిదీన్​లు తొలి ఉగ్రదాడి చేశారు. ఈ టెర్రరిస్టుల సాయంతో పాకిస్తాన్ భారత్​లో కొంత భాగాన్ని ఆక్రమించుకున్నది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకునే వరకూ వెనకడుగు వేయొద్దని అప్పుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చెప్పారు. 

కానీ ఆయన మాటలను అప్పటి పాలకులు పెడచెవిన పెట్టారు. అప్పటి నుంచి పాకిస్తాన్ టెర్రరిస్టులు రక్తం రుచి మరిగారు. 75 ఏండ్లుగా టెర్రరిజాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ మూడు సార్లు యుద్ధంలో ఓడిపోయింది. ఇక భారత్ తో మిలిటరీ సంఘర్షణ జరిగితే గెలవలేమని ఆ దేశానికి అర్థమైంది. అందుకే టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తూ.. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత్​లోకి పంపుతూ అమాయకులు, యాత్రికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నది” అని ప్రధాని మండిపడ్డారు. 

సింధూ జలాలను నిర్లక్ష్యం చేశారు.. 

మన దేశంలో సింధూ జలాల ఒప్పందం పరిధిలోకి వచ్చే నదులపై నిర్మించిన డ్యాంలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ప్రధాని మోదీ అన్నారు. పూడిక తీయక వాటి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందన్నారు. సింధూ జలాలను వాడుకోవడం భారతీయుల హక్కు అని స్పష్టంచేశారు. ఇప్పుడు తమ ప్రభుత్వం సింధూ జలాల విషయంలో చర్యలు చేపట్టిందని, దీంతో పొరుగు దేశానికి ఆల్రెడీ సెగ మొదలైందని అన్నారు.

4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం.. 

భారత్ ఎల్లప్పుడూ పొరుగు దేశాలకు కష్టకాలంలో సాయం చేస్తూ వచ్చిందని, పక్క దేశాల అభివృద్ధి, సంక్షేమం కోసం చేయూతను ఇచ్చిందని ప్రధాని మోదీ చెప్పారు. పొరుగు దేశాలకు ఇంత సాయం చేసినా తరచూ హింసాత్మక దాడులను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. భారత్ ఎల్లప్పుడూ శాంతి, సౌభాగ్యాన్నే కోరుకుంటుందని, ప్రపంచ క్షేమాన్నే కాంక్షిస్తుందని తేల్చి చెప్పారు. 2014లో తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు దేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని.. ఈ పదకొండేండ్లలో ఎన్నో సవాళ్లు ఎదురైనా అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందన్నారు.

గణేశ్​ విగ్రహాలూ దిగుమతి చేసుకునుడేనా.. 

దేశంలోకి చైనా వస్తువులు వెల్లువెత్తడంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. గణేశ్ విగ్రహాలను, దీపావళి టపాసులను, హోలీ రంగులను దిగుమతి చేసుకోవడం తగ్గించుకోవాలని, మేడ్ ఇన్ ఇండియా వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ‘‘ఇండియాను కాపాడుకునేందుకు ఆపరేషన్ సిందూర్​ను చేపడదాం. ఈ బాధ్యత కేవలం సాయుధ బలగాలదే కాదు. 140 కోట్ల మంది భారతీయులది కూడా” అని మోదీ చెప్పారు.