
Olectra Greentech: నేడు మార్కెట్ ఇంట్రాడే సమయంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ షేర్లు ఏకంగా 14 శాతం కుప్పకూలాయి. దీంతో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.వెయ్యి 160 స్థాయికి పడిపోయింది. వాస్తవానికి ఈ కంపెనీ మేఘా ఇంజనీరింగ్ సంస్థకు పూర్తి అనుబంధ సంస్థ కావటం గమనార్హం.
నేడు మార్కెట్లో కంపెనీ షేర్ల పతనానికి పెద్ద కారణం ఉంది. అదేంటంటే మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ కంపెనీతో గతంలో కుదుర్చుకున్న డీల్ క్యాన్సిల్ చేయటమే. వాస్తవానికి కంపెనీ ముందుగా పేర్కొన్న గడువులకు బస్సులను డెలివరీ చేయలేకపోవటం వల్ల తాము ఆర్డర్ కాన్సిల్ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి కంపెనీ మే 22 నాటికి 1000 బస్సులను డెలివరీ చేయాల్సి ఉండగా.. అందులో కనీసం ఒక్క బస్సును కూడా ఇప్పటి వరకు అందించలేదు. తన ఎక్స్ ఖాతా పోస్టులో మంత్రి కంపెనీ పేరును ప్రస్తావించనప్పటికీ అధికారుల సూచన మేరకు 5వేల 150 ఎలక్ట్రిక్ బస్సులకు గతంలో ఇచ్చిన టెండర్ క్యాన్సిల్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వాస్తవానికి జూలై 2023లో ఒలెక్ట్రా అలాగే ఎవిరి టెక్ సంస్థలు సంయుక్తంగా బస్సుల సప్లై కోసం ఆర్డర్ దక్కించుకున్నాయి. 12 ఏళ్ల కాంట్రాక్టు కాలానికి రూ.10వేల కోట్ల డీల్ జరిగింది. దీనికింద ఒలెక్ట్రా మహారాష్ట్ర రవాణా శాఖకు తర్వాతి 24 నెలల కాలంలో బస్సులను అందించటంతో పాటు వాటి సర్వీసుకు బాధ్యత స్వీకరించాలి. కంపెనీకి గడువు పెంచుతూ అవకాశం కల్పించినప్పటికీ ప్రాజెక్టు ముందుకు నడవలేదని మహారాష్ట్ర అధికారులు చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఒలెక్ట్రా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.