స్వదేశంలో జరగనున్న యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టుకు గాయాల బెడద వేధిస్తోంది. ఇంగ్లాండ్ తో నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా జరగబోయే తొలి టెస్టుకు ముగ్గురు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు దూరం కానున్నారు. ఇప్పటికే పాట్ కమ్మిన్స్, సీన్ అబాట్ తొలి టెస్టుకు దూరం కాగా.. తాజాగా ఈ లిస్టులో జోష్ హాజిల్‌వుడ్ చేరాడు. తొడ కండరాల గాయం కారణంగా హేజల్ వుడ్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడం ఉండడం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా శనివారం (నవంబర్ 15) కన్ఫర్మ్ చేసింది. యాషెస్ కు ముందు ఆస్ట్రేలియాలో జరిగిన డొమెస్టిక్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో ఈ స్టార్ పేసర్ గాయపడ్డాడు.
ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు దూరం కావడంతో ఆస్ట్రేలియాకు తొలి టెస్టులో విజయం సవాలుగా మారింది. డిసెంబర్‌లో బ్రిస్బేన్‌లో జరిగే రెండో టెస్ట్‌కు కమ్మిన్స్, హాజిల్‌వుడ్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. రిజర్వ్ ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ కూడా గాయం కారణంగా దూరం కావడంతో మైఖేల్ నేసర్ ను శనివారం (నవంబర్ 15) స్క్వాడ్ లో చేర్చుకుంది. మైఖేల్ నేసర్ రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. నేసర్ తొలి టెస్ట్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపించడం లేదు. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ తో పాటు బ్రెండన్ డాగెట్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంది.
ALSO READ : సెహ్వాగ్‌ను దాటి అగ్రస్థానానికి..
క్రికెట్ లో ప్రస్తుతం యాషెస్ ఫీవర్ నడుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఈ మెగా టోర్నీ నవంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 21 నుంచి స్టార్ట్ కానుంది. సొంతగడ్డ కావడంతో ఆస్ట్రేలియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఈ మెగా సిరీస్ కు 6 రోజుల సమయం మాత్రమే ఉంది. సొంతగడ్డపై జరగబోయే ఈ టెస్ట్ సిరీస్ ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. మరోవైపు 2015 నుంచి యాషెస్ గెలవని ఇంగ్లాండ్ ఎలాగైనా ఆసీస్ కు షాక్ ఇవ్వాలని చూస్తోంది.
చివరిసారిగా ఇంగ్లాండ్ లో జరిగిన యాషెస్ 2-2 తో సమమైంది. తొలి రెండు టెస్టులు ఆస్ట్రేలియా గెలిస్తే చివరి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ రెండు టెస్టులు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. అంతకముందు 2021-22 యాషెస్ లో ఆస్ట్రేలియా 4-0తో గెలిచింది. ఆస్ట్రేలియా చివరి 15 స్వదేశీ టెస్టుల్లో రెండింటిలో మాత్రమే ఓడిపోయింది. ఓవరాల్ గా ఇప్పటి వరకూ చరిత్రలో మొత్తం 330 యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 136 టెస్టులు, ఇంగ్లండ్ 108 టెస్టులు గెలవగా.. 91 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇటీవలే ఇండియాతో ఇంగ్లాండ్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా వెస్టిండీస్ పై 3-0 తేడాతో గెలిచింది.
