
- మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే నోటీసుల పేరుతో డ్రామాలాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులివ్వడంపై మంగళవారం సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం, మంత్రులు అవినీతితో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోందని ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో నీతి ఆయోగ్ ను బహిష్కరించిన సీఎం రేవంత్.. ఇప్పుడు ఈడీ కేసు నమోదు కావడంతో మోదీ చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. కేటీఆర్ విజన్ ను చూసి విదేశాలు ఆహ్వానిస్తుంటే ఓర్వలేక కేసుల పేరుతో చిల్లర వేషాలు వేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలమైందని, నాయకుల చేష్టలతో విసిగిపోయిన ప్రజలు తిరుగుబాటు చేయడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టడం మాని.. దోపిడీకి గురవుతున్న తెలంగాణ నీటి హక్కులను కాపాడడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.