
- నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి
హాలియా, వెలుగు : సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి హోంమంత్రిగా పనిచేసిన కాలంలో పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాలకు ఇప్పుడు పట్టాలివ్వడం నా పూర్వజన్మ సుకృతమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. మంగళవారం తిరుమలగిరిసాగర్ మండలం కొంపెల్లి గ్రామంలోని 261 సర్వే నెంబర్లో గల 4 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమిలో 172 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్ల స్థలాల పంపిణీలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన ఉందన్నారు. సంక్షేమ పథకాలను సృష్టించిందే కాంగ్రెస్ అని అన్నారు. 3,500 ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గానికి ఇప్పటికే మంజూరు చేశామన్నారు. త్వరలో ఎల్లాపురం తండా, బోయగూడం గ్రామాల్లో పేదలకు ఇంటి స్థలాలను పంపిణీ చేస్తామన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లింగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్, గడ్డం సాగర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.