వర్షాకాలం సీజన్ లో ఇన్ ఫెక్షన్లు సోకి జనాలు రోగాల బారిన పడే అవకాశం ఉంది. అసలే వర్షాలు ముదురుతున్నాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కేరళలో కొత్త స్వైన్ ఫ్లూ కలకలం రేపింది. ఉత్తర కేరళ జిల్లాలోని కనిచర్ గ్రామంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందిందని అధికారులు పేర్కొన్నారు. అక్కడి జిల్లా కలెక్టర్ పొలాల్లోని పందులను చంపాలని ఆదేశించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శుక్రవారం ( ఆగస్టు 18) మలయంపాడి వద్ద ఉన్న ఓ పొలంలో స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. జిల్లా అధికారులు ఆ ప్రాంతానికి 10 కిలోమీటర్ల పరిధిలో పొలంలో ఉన్న పందులను చంపి, ప్రొటోకాల్ ప్రకారం మృతదేహాలను పూడ్చాలని ఆదేశించారు.
పందులున్న ప్రాంతంలో ఒక కిలోమీటరు విస్తీర్ణంలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించిన ప్రాంతాన్ని వ్యాధి సోకిన ప్రాంతంగానూ, 10కిలోమీటర్ల వ్యాసార్థాన్ని వ్యాధి నిఘా జోన్‌గానూ (రెడ్ అలెర్ట్) ప్రకటించామని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో పంది మాంసం పంపిణీ, అమ్మకం, ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం మూడు నెలల పాటు నిషేధించారు. రెండు నెలల్లో నష్టపోయిన పొలంలోని పందులను ఎక్కడ పడేశారో అత్యవసరంగా నివేదిక ఇవ్వాలని జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ ఛైర్మన్ , కలెక్టర్ స్థానిక అధికారులను కోరారు. గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కడైనా వ్యాధి తాజా కేసులు నమోదైతే వెంటనే విపత్తు నిర్వహణ అధికారులకు తెలియజేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కుగ్రామంలోని వెటర్నరీ అధికారిని ఆదేశించారు.
