-
నియోజకవర్గం బరిలో లేని వరుణ్, మేనకా గాంధీ
పిలిభిత్: ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ నియోజకవర్గం పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే పేర్లు మేనకాగాంధీ, వరుణ్‌గాంధీ. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు దశాబ్దాలకుపైగా ఈ తల్లీకొడుకుల్లో ఎవరో ఒకరు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో వరుణ్‌గాంధీ పేరు కనిపించలేదు. పిలిభిత్ నియోజకవర్గ సీటును బీజేపీ అధిష్టానం యూపీ మంత్రి జితిన్ ప్రసాదకు కేటాయించింది.
దాదాపు 30 ఏండ్లుగా మేనకాగాంధీ, వరుణ్‌గాంధీతో అనుబంధం పెంచుకున్నామని ప్రజలు అంటుండగా.. తల్లీకొడుకుల మద్దతులేకుండానే ఇక్కడ గెలిచేందుకు బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ ఇక్కడ ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు.
తల్లీకొడుకులతో విడదీయరాని అనుబంధం
పిలిభిత్ నియోజకవర్గ ప్రజలతో మేనక, వరుణ్ గాంధీలకు విడదీరాని అనుబంధం ఉన్నది. 1989లో మేనకాగాంధీ జనతా దళ్ పార్టీ తరఫున ఇక్కడినుంచి మొదటిసారి గెలుపొందారు. 1991లో ఓడిపోయారు. మళ్లీ 1996లో విజయం సాధించారు. 1998, 1999లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 2004, 2014లో బీజేపీ అభ్యర్థిగా పిలిభిత్నుంచి మేనకాగాంధీ పోటీ చేసి, ఎంపీగా విజయం సాధించారు. అనంతరం 2009, 2019లో పిలిభిత్నుంచి బీజేపీ ఎంపీగా వరుణ్ గాంధీ గెలుపొందారు.
ఈసారి సిట్టింగ్ ఎంపీ అయిన వరుణ్‌గాంధీకి పిలిభిత్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం నిరాకరించింది. యూపీ మంత్రి జితిన్ ప్రసాదను ఇక్కడినుంచి బరిలో నిలిపింది. ఈ నియోజకవర్గంలో ఏప్రిల్19న ఎన్నికలు జరగనున్నాయి. పిలిభిత్నియోజకవర్గంతో మేనకాగాంధీ, వరుణ్‌గాంధీకి విడదీయరాని అనుబంధం ఉండటంతో జితిన్ ప్రసాద గెలుపునకు ఇక్కడ బీజేపీ చాలా కష్టపడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జితిన్ ప్రసాదను నియోజకవర్గ ప్రజలు బయటివ్యక్తిగా చూస్తున్నారని సుశీల్ కుమార్ గాంగ్వార్ అనే ఓ రిటైర్డ్ ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. వరుణ్‌గాంధీతో తమకున్న అనుబంధం పాతది.. గాఢమైనది అంటూ ఓ గ్రామాధికారి బాబురాం లోధి భావోద్వేగంతో ఓ బహిరంగ లేఖ కూడా రాశారు.
ప్రచారానికి వరుణ్ దూరం
పిలిభిత్ టికెట్‌ను జితిన్ ప్రసాదకు కేటాయించడంపై వరుణ్ గాంధీ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. అప్పటినుంచి ఆయన నియోజకవర్గానికి ఒక్కసారిగా కూడా రాలేదు. సీఎం యోగి నిర్వహించిన ఎన్నికల ర్యాలీకి కూడా హాజరు కాలేదు. ప్రధాని మోదీ ర్యాలీకి కూడా ఆయన హాజరయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. నియోజకవర్గ ప్రజలకు ఆయన లేఖ కూడా రాశారు. ‘నా చివరి శ్వాస వరకు మీతో అనుబంధం చెక్కుచెదరకుండా ఉంటుంది. పిలిభిత్‌తో నాకున్న బంధం ప్రేమ, విశ్వాసంతో కూడుకున్నది.
ఎంపీగా లేకున్నా మీ బిడ్డగా ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటా’ అని రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. నియోజకర్గంలోని బీజేపీ నేతల మద్దతు తనకుందని జితిన్ ప్రసాద చెప్పుకుంటుండగా.. వరుణ్ గాంధీకి టికెట్ నిరాకరణపై స్థానిక నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారని సమాచారం. మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ తరఫున కుర్మీ ఓటర్లలో పట్టున్న మాజీ మంత్రి భగవత్ శరణ్ గాంగ్వార్, బీఎస్పీ తరఫున ముస్లిం ఓటర్లలో పట్టున్న అనీస్ అహ్మద్ బరిలో నిలువడం.. వరుణ్ గాంధీ వర్గం గుర్రుగా ఉండటంతో పిలిభిత్‌లో ఈసారి గెలువాలంటే బీజేపీ బాగా శ్రమించక తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.