ఎలాన్ మస్క్ అన్నీ సర్దుకుని సౌతాఫ్రికాకు పోవాల్సి వస్తది: ట్రంప్

ఎలాన్ మస్క్ అన్నీ సర్దుకుని సౌతాఫ్రికాకు పోవాల్సి వస్తది: ట్రంప్
  • అన్నీ సర్దుకుని సౌతాఫ్రికాకు పోవాల్సి వస్తది: ట్రంప్ 
  • డోజ్​ను వదిలితే ఆయనను మింగేసేదని ఫైర్​
  • ‘వన్ బిగ్’ బిల్లు పాసైన తెల్లారే కొత్త పార్టీ పెడతానని మస్క్​ వెల్లడి
  • సబ్సిడీలు, కాంట్రాక్టులు కట్ చేసి చూడాలని సవాల్ 

వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ను తమ దేశం నుంచి డిపోర్ట్ చేయడం(వెనక్కి పంపడం) గురించి ఆలోచిస్తున్నానంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ట్రంప్ సర్కారు తెచ్చిన ‘వన్ బిగ్, బ్యూటిఫుల్ బిల్లు’పై మస్క్ మరోసారి విమర్శలు చేసిన నేపథ్యంలో ఆయనపై ట్రంప్ ఈ మేరకు ఫైర్ అయ్యారు. 

మంగళవారం వైట్ హౌస్ లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఎలాన్ మస్క్ అక్రమ వలసదారుడు అని, ఆయనను దేశం నుంచి తిప్పి పంపాలంటూ రిపబ్లికన్, డెమోక్రటిక్ నేతలు పలువురు చేస్తున్న డిమాండ్ పై విలేకరులు ప్రశ్నించగా ఈ మేరకు స్పందించారు. ‘‘మస్క్ ను డిపోర్ట్ చేసే అవకాశం ఉందా? అన్నది నాకు తెలియదు. దీని సాధ్యాసాధ్యాలను మేం పరిశీలించాల్సి ఉంది” అని బదులిచ్చారు. 

‘వన్ బిగ్, బ్యూటిఫుల్ బిల్’ పాస్ అయితే అమెరికా దివాళా తీస్తుందని నెల రోజుల క్రితం మస్క్ విమర్శలు చేయడంతో ఇద్దరి మధ్యా సోషల్ మీడియాలో తీవ్ర వాగ్వాదం సాగింది. ఆ తర్వాత తన కామెంట్లపై మస్క్ విచారం వ్యక్తం చేయడంతో సమస్య సద్దుమణిగింది. తాజాగా వన్ బిగ్ బిల్లుపై సెనెట్ లో చర్చకు ఓటింగ్ జరగడంతో మస్క్ మళ్లీ సోమవారం విమర్శలు ప్రారంభించారు. 

దీంతో ఆయనపై ట్రంప్ మళ్లీ ఘాటుగా కామెంట్లు చేశారు. చరిత్రలో ఏ వ్యక్తీ పొందనంత సబ్సిడీలను మస్క్ పొందుతున్నారని, ఆ సబ్సిడీలు లేకపోతే ఆయన దుకాణం మూసుకుని సౌతాఫ్రికా(మస్క్ పుట్టిన దేశం) వెళ్లాల్సి వస్తుందని సోమవారం రాత్రి ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ పెట్టారు. 

ఈవీ పాలసీయే అసలు కారణం!

నెల రోజుల క్రితం వరకూ ట్రంప్ కు ముఖ్య మద్దతుదారుగా ఉన్న మస్క్.. ఆయనకు దూరం కావడానికి ప్రధాన కారణం వన్ బిగ్, బ్యూటిఫుల్ బిల్లులో భాగంగా తెచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్(ఈవీ) పాలసీయే కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. వృద్ధులు, పేదలకు అతి ముఖ్యమైన హెల్త్ కేర్ స్కీం(ఆరోగ్య బీమా)కు, వ్యవసాయ రంగానికి నిధుల కోతతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుకు 7,500 డాలర్ల(రూ. 6.40 లక్షలు) చొప్పున ఇస్తున్న సబ్సిడీని రద్దు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.

 మరోవైపు మాస్ డిపోర్టేషన్లకు, బార్డర్ వాల్ నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించాలని, మిలిటరీ ఖర్చును 150 బిలియన్ డాలర్లు పెంచాలని పేర్కొన్నారు. ఇందులోని ఈవీ పాలసీ వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ కు డిమాండ్ భారీగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే మస్క్ కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీ టెస్లా దివాళా తీసే పరిస్థితులు వస్తాయని, అందుకే ఈ బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. 

మస్క్ పౌరసత్వం  రద్దయ్యే చాన్స్ ఉందా? 

ఎలాన్ మస్క్ సౌతాఫ్రికాలోని ప్రిటోరియాలో 1971లో జన్మించారు. అమెరికాకు వచ్చి చాలా ఏండ్లు నివసించిన తర్వాత 2002లో ‘నేచురలైజేషన్’ విధానంలో పౌరసత్వం పొందారు. తాను జే1 వీసాపై అమెరికాకు వచ్చానని, తర్వాత తన వీసా హెచ్1బీ కేటగిరీకి మారిందని.. తాను చట్టబద్ధంగానే అమెరికా పౌరుడిని అయ్యానని మస్క్ ఇదివరకే స్పష్టం చేశారు. 

అయితే, అక్రమ వలసదారుడు అని, డిపోర్ట్ చేయాలంటూ పలువురు కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన స్పేస్ఎక్స్ కంపెనీని సీజ్ చేయాలని కూడా అంటున్నారు. కాగా, అమెరికా చట్టాల ప్రకారం నేచురలైజేషన్ విధానం ద్వారా పొందిన సిటిజన్ షిప్ ను రద్దు చేసే అవకాశం కూడా ఉంది.

సెనెట్ లో ‘వన్ బిగ్’ బిల్లు పాస్

వన్ బిగ్, బ్యూటిఫుల్ బిల్లును అమెరికన్ కాంగ్రెస్ లోని ఎగువ సభ సెనెట్ మంగళవారం ఆమోదించింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో చేపట్టిన 4.5 ట్రిలియన్ ట్యాక్స్ కోతల రెన్యువల్ కు సంబంధించిన ఈ బిల్లుకు మారథాన్ వోటింగ్ సెషన్ తర్వాత సెనెట్ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్ లో 50: 50 ఓట్లతో టై అయింది. 

దీంతో వైస్ ప్రెసిడెంట్, సెనెట్ అధ్యక్షుడు జేడీ వాన్స్ ఓటు హక్కును వినియోగించి, బిల్లును పాస్ చేశారు. ఈ బిల్లును ప్రతినిధుల సభ ఆమోదానికి పంపనున్నారు. అక్కడ కూడా ఆమోదం పొందిన 
తర్వాత బిల్లు చట్టరూపం దాల్చనుంది. 

బిల్లు పాసైన మర్నాడే కొత్త పార్టీ: మస్క్ 

అమెరికన్ కాంగ్రెస్ లో వన్ బిగ్, బ్యూటిఫుల్ బిల్లు పాస్ అయితే, ఆ మరునాడే కొత్త పార్టీని పెడతానని మస్క్ మరోసారి ప్రకటించారు. ఈ బిల్లుపై సెనెట్ లో చర్చకు రంగం సిద్ధమైన నేపథ్యంలో సోమవారం మస్క్ ఈ మేరకు ‘ఎక్స్’లో స్పందించారు. బిల్లు ఆమోదం పొందితే, మరుసటి రోజే ‘అమెరికా పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెడతానన్నారు. 

సబ్సిడీలు, కాంట్రాక్టులు రద్దు చేస్తే మస్క్ దుకాణం బందవుతుందన్న ట్రంప్ కామెంట్లపై మళ్లీ మంగళవారం స్పందించారు. ‘‘నేనూ అదే చెప్తున్నా. అన్నింటినీ కట్ చేయండి. ఇప్పుడే” అని ‘ఎక్స్’లో సవాల్ చేశారు. ట్రంప్ ఆధ్వర్యంలోని రిపబ్లికన్ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ రెండూ ఒకటేనని, వాటి విధానాలతో దేశం దివాలా తీస్తుందన్నారు. అందుకే ప్రజల కోసం నిజంగా ఆలోచించే కొత్త పార్టీ అవసరం ఉందన్నారు. 

ప్రభుత్వ ఖర్చులను తగ్గిస్తామని ఎన్నికలప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ సభ్యులు ఇప్పుడు.. వన్ బిగ్ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. నెల రోజుల క్రితం ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కూడా మస్క్ డిమాండ్ చేశారు. తన మద్దతు లేకపోతే ట్రంప్ అసలు ఎన్నికల్లో గెలిచేవారే కాదన్నారు.  

ఆ తర్వాత గొడవ సద్దుమణిగినట్టు అనిపించినా.. తాజాగా వీరిద్దరి మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.