- బార్డర్ ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం
కాబూల్: కునార్ నదిపై డ్యాం కట్టి పాకిస్తాన్ కు నీటి లభ్యత తగ్గేలా చేయాలని తాలిబాన్ నేతృత్వంలోని అఫ్గాన్ ప్రభుత్వం నిర్ణయించింది. సాధ్యమైనంత త్వరగా ఈ నదిపై డ్యాం నిర్మించాలని తాలిబాన్ సుప్రీం లీడర్ మౌలావి హిబతుల్లా అఖుంద్జాదా అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని అఫ్గాన్ సమాచార, ఇంధన, జలాల శాఖ శుక్రవారం ‘ఎక్స్’ లో వెల్లడించింది. ఇటీవలే అఫ్గాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన పరస్పర దాడుల్లో కొన్ని వందల మంది ప్రజలు, సైనికులు చనిపోయిన నేపథ్యంలో తాలిబాన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో టూరిస్టులను మతం అడిగి పాక్ ఉగ్రవాదులు చంపేశారు. దీంతో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దుచేస్తూ పాకిస్తాన్ కు భారత్ షాక్ ఇచ్చింది. కొత్త డ్యాంలు కట్టి సింధూ నదీ జలాలను పాక్ కు వెళ్లకుండా అడ్డుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పుడు అఫ్గాన్ లోని తాలిబాన్ సర్కారు కూడా ఇలాగే పాక్ పై చర్యలు తీసుకోనుంది.
నీళ్లు ఆపేస్తే.. పాక్ పై తీవ్ర ప్రభావం
పాకిస్తాన్ సరిహద్దుల్లోని బ్రోఘిల్ పాస్ వద్ద ఈశాన్య అఫ్గాన్ లోని హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో కునార్ నది జన్మిస్తుంది. 480 కి.మీ. ప్రవహిస్తుంది. కునార్, నంగర్ హార్ ప్రావిన్సుల ద్వారా దక్షిణంవైపు జలాలాబాద్ సిటీ దగ్గర కాబూల్ నదిలో కలుస్తుంది. తర్వాత పాక్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ప్రవేశిస్తుంది.
పాక్ లో ఈ నదిని చిత్రాల్ నదిగా పిలుస్తారు. కాబూల్ నదిలో కలిసే కునార్ నది అఫ్గాన్, పాక్ మధ్య అతిపెద్ద సరిహద్దు నది. పాక్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో నీటిపారుదల, ఇతర నీటి అవసరాల కోసం కాబూల్ నది కీలకంగా ఉంది. కునార్ నదిలో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే పాక్ లోని పంజాబ్ తో పాటు పలు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
