
తిరువనంతపురం: బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్35బీ ఫైటర్ జెట్ ఎట్టకేలకు టేకాఫ్ అయింది. టెక్నికల్ సమస్యతో నెల రోజులకుపైగా తిరువనంతపురం ఎయిర్ పోర్టులోనే ఉన్న విమానం.. బుధవారం ఉదయం 10.50 గంటలకు టేకాఫ్ అయి ఆస్ట్రేలియాలో డార్విన్ కు బయలుదేరింది. యూకే నుంచి వచ్చిన 15 మంది ఇంజినీర్ల బృందం ఫైటర్ జెట్‌కు విజయవంతంగా రిపేర్లు చేసిందని ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.
ఈ నెల 6 నుంచి 21 వరకు విమానానికి అన్ని రిపేర్లు చేశారు. దీంతో విమానాన్ని సోమవారం హ్యాంగర్ నుంచి ఎయిర్ పోర్టు బేకు తరలించారు. కాగా.. జెట్‌కు రిపేర్ల సమయంలో సహకరించిన భారత అధికారులు, ఎయిర్ పోర్ట్ టీమ్స్‌కు బ్రిటిష్ హైకమిషన్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు హైకమిషన్ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ఇండియాతో డిఫెన్స్ పార్ట్ నర్ షిప్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపారు.