చేతల్లోకి దిగిన మోడీ.. బీజేపీ ఆఫీస్ లోనే స్టార్ట్

చేతల్లోకి దిగిన మోడీ.. బీజేపీ ఆఫీస్ లోనే స్టార్ట్
  • ప్లాస్టిక్ బ్యాన్ దిశగా బీజేపీ సీఈసీ మీటింగ్

న్యూఢిల్లీ: ‘వట్టి మాటలు కట్టిపెట్టి.. ఇక చేతల్లోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది’.. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రపంచ దేశాలకు స్ఫూర్తినిచ్చేలా గత వారం  ప్రధాని నరేంద్ర మోడీ యూఎన్ జనరల్ అసెంబ్లీలో చెప్పిన మాటలివి.

‘మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంకల్పిద్దాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని వదిలేస్తామని 130 కోట్ల మంది భారతీయులం తీర్మానించుకుందాం’.. ఆదివారం ఉదయం మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ చెప్పిన మాటలివి.

‘వట్టి మాటలు చెప్పడం కాదు.. గట్టి మేలు తలపెట్టడానికి చేతల్లోకి దిగేవాడిని నేను’ అని ప్రత్యక్షంగా నిరూపించే ప్రయత్నం చేశారాయన. ఆదివారం రాత్రి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీనే దానికి వేదికగా ఎంచుకున్నారు. తన మాటలను పార్టీ ఆఫీసులో ఆచరించేలా చేశారు.

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఎంపిక కోసం ఆ పార్టీ సీఈసీ సమావేశమైంది. ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సహా సీనియర్ నాయకులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.

సమావేశంలో నేతలందరికీ  ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు గాజు జగ్గుల్లో నీటిని అందించారు. ఈ మీటింగ్ కు సంబంధించిన ఫొటోల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు లేకపోవడం కొత్తగా కనిపించింది. వాటి స్థానంలో గాజు గ్లాసులు, జగ్గులు… సీనియర్ నేతలందరి ఎదుట కనిపించాయి.

మార్చిలో అలా..

ఈ ఏడాది మార్చి 20న సార్వత్రిక ఎన్నికల కసరత్తులో భాగంగా బీజేపీ సీఈసీ భేటీ జరిగింది. ఆ రోజు ప్రతి నేత ముందు ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు ఉన్నాయి.

ఎన్నికలు పూర్తయి రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యావరణ పరిరక్షణపై మోడీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వదిలేయాలని పిలుపునిచ్చారాయన. అలాగే గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించేందుకు పలు నిర్ణయాలను తీసుకుంటున్నారు. సోలార్ విద్యుత్, ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం వంటి వాటిని పోత్సహిస్తున్నారు.

ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక గౌరవం

పర్యావరణ పరిరక్షణకు భారత్ తీసుకుంటున్న చర్యలకు గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా గౌరవించింది. పర్యవరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై గత వారం న్యూయార్క్ జరిగిన యూఎన్ సర్వ సభ్య సమావేశంలో తొలి ప్రసంగం చేసే అవకాశం ప్రధాని మోడీకి ఇచ్చారు యూఎన్ జనరల్ సెక్రెటరీ ఆంటోనియో గ్యుటెరస్.

ఆచరణలోకి..

నాటి ప్రసంగంలో ‘మాటలకు సమయం ముంగిసింది. ఇక చేతల్లోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది’ అని మోడీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆ మాటలను ప్రధాని మోడీ నేడు ఆచరణలో పెట్టి చూపించారు.