V6 News

ఎన్టీఆర్ 'డ్రాగన్' లోకి బాలీవుడ్ బ్యూటీ.. అలియా భట్ ఎంట్రీతో మారుతున్న లెక్కలు?

ఎన్టీఆర్ 'డ్రాగన్' లోకి బాలీవుడ్ బ్యూటీ.. అలియా భట్ ఎంట్రీతో మారుతున్న లెక్కలు?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'డ్రాగన్ ' ( Dragon ) . ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా యాక్షన్ గురించే మాత్రమే కాదు.. కాస్టింగ్ కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఎన్టీఆర్ సరసన అలియా?

ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, రాజమౌళి ‘RRR’ తర్వాత తారక్, అలియా కాంబోలో రాబోతున్న రెండో చిత్రమిది. 'RRR' లో వీరు కలిసి నటించినప్పటికీ, అలియా రామ్ చరణ్ సరసన కనిపించింది. కానీ ‘డ్రాగన్’ లో వీరిద్దరి మధ్య పవర్ ఫుల్ సీన్స్ ఉంటాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన మే 20న (ఎన్టీఆర్ పుట్టినరోజు) వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కీల్ జోరుగా ప్రచారం జరుగుతుంది..

విలన్‌గా షాహిద్ కపూర్?

మొదట ఈ సినిమాలో మలయాళ స్టార్ టోవినో థామస్ విలన్‌గా నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు ఆ పవర్‌ఫుల్ విలన్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ పేరును పరిశీలిస్తున్నారు. షాహిద్ లాంటి యాక్టర్ ఎన్టీఆర్ కు ప్రతినాయకుడిగా కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద యుద్ధమే అని చెప్పాలి. వీరికి తోడుగా సీనియర్ నటుడు అనిల్ కపూర్, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తారక్ 'బీస్ట్ మోడ్'..!

ఇటీవల చిత్ర యూనిట్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక జిమ్ ఫోటోను విడుదల చేసింది. తన కండలు తిరిగిన శరీరాన్ని, రాతి శిల్పంలా ఉన్న బ్యాక్ మజిల్స్ ని చూపిస్తూ తారక్ "Built, Not Bought" అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా ఆలస్యం అవుతుందనే వార్తలకు ఈ ఒక్క ఫోటోతో చెక్ పెట్టారు మేకర్స్. ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

రిలీజ్ ఎప్పుడు?

మొదట ఈ సినిమాను 2026 జూన్ 25న విడుదల చేయాలని భావించినప్పటికీ, విజువల్ ఎఫెక్ట్స్, భారీ మేకింగ్ దృష్ట్యా 2027 వేసవికి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ హింట్ ఇచ్చారు. ఏది ఏమైనా, ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ మాస్ పర్ఫార్మెన్స్ తో ‘డ్రాగన్’ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.