రోడ్డు ప్రమాదంలో ఎస్సై అభ్యర్థి మృతి

రోడ్డు ప్రమాదంలో ఎస్సై అభ్యర్థి మృతి

ఎస్సై పరీక్ష రాశాక.. ఇవాళే జరగబోతున్న తమ్ముడి పెళ్లి కోసం బైక్ పై ఇంటికి బయలుదేరాడు.  మార్గం మధ్యలో అతడి బైక్ ను ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలోని టీఎస్ ఐఐసీ కాలనీ వద్ద  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 25 ఏళ్ల  ఆంజనేయులు సికింద్రాబాద్ లోని నల్లకుంట వాస్తవ్యుడు. ఎస్సై పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ కాలేజీలో పరీక్షా కేంద్రం పడింది. దీంతో అక్కడికి ఇవాళ ఉదయం  బైక్ పై వచ్చిన ఆంజనేయులు పరీక్ష రాశాడు.

ఇవాళే ఆంజనేయులు తమ్ముడి పెళ్లి కూడా ఉంది. పరీక్ష పూర్తయ్యాక.. తమ్ముడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు  సికింద్రాబాద్ లోని తన ఇంటికి బైక్ పై బయలుదేరాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్యాంకర్ అతడి బైక్ ను ఢీకొట్టింది. బైక్ పై నుంచి కిందపడిన ఆంజనేయులు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు.  పోలీసులు  మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.