
- ఎన్నికల కోడ్‌తో ఆశలు ఆవిరి
- విద్యాశాఖలో రెగ్యులరైజేషన్, ఏజ్ పెంపు, ఎంటీఎస్ అమలుకు బ్రేక్
- పండిట్, పీఈటీ అప్ గ్రేడేషన్ ఆర్డినెన్స్ విషయంలోనూ నిరాశ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొన్ని వర్గాల్లో నిరాశ అలుముకున్నది. షెడ్యూల్ రాకముందే ప్రభుత్వం తమకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తే.. సోమవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సర్కారు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఇంకా మిగిలిపోయిన కాంట్రాక్టు లెక్చరర్లతో పాటు వర్సిటీ లెక్చరర్లకూ సర్కారు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరిగింది. సర్కారు వర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కోడ్ అమల్లోకి రావడంతో, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది. వర్సిటీ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ 62 ఏండ్లకు పెంపుపై సర్కారు వారిలో ఆశలు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులకు 61 ఏండ్లకు పెంచగా, వర్సిటీ ప్రొఫెసర్ల ఏజ్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఏపీలో 62 ఏండ్లకు పెంచగా, తెలంగాణలోనూ 62 ఏండ్లకు పెంచాలనే ప్రతిపాదనలు రెడీ చేసి, విద్యాశాఖ సర్కారుకు పంపించింది. ఈ ఫైల్ సీఎంవోలో పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కోడ్ రావడంతో ఇదీ పక్కకుపోయింది.
రీఅప్పీలుకు వెళ్లాలనుకున్నా..
సమగ్ర శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ ఉద్యోగులకు ప్రభుత్వం మినిమమ్ టైమ్ స్కేల్(ఎంటీఎస్) ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో వారంతా ఆందోళన విరమించారు. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ రావడంతో, వారిలో అయోమయం నెలకొన్నది. అయితే, ఇప్పటికీ నేడో రేపో జీవో ఇస్తుందని లీడర్లు వారికి చెప్తుండటం గమనార్హం. రాష్ట్రంలో పండిట్, పీఈటీల అప్‌గ్రేడేషన్‌పై హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు రావడంతో దీనిపై సర్కారు ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నది. తీరా కోడ్ రావడంతో ఆ అంశం పక్కకు పోయింది. దీంతో ప్రస్తుతం హైకోర్టు తీర్పుపై రీ అప్పీల్‌కు పోవాలని సర్కారు ఆలోచిస్తున్నది. వీటితో పాటు హైదరాబాద్‌లో పనిచేసే జర్నలిస్టులకు కొత్తగా ఏర్పాటైన ఓ సొసైటీకి ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఇండ్ల స్థలాలను కేటాయిస్తూ జీవో ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ, కోడ్ రావడంతో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. కొన్ని జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొన్నది.