హైదరాబాద్, వెలుగు: ఆషాఢమాసం ముగిసి సోమవారం నుంచి శ్రావణమాసం స్టార్ట్ కానున్నది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి మూఢం, శూన్య మాసంతో పెండ్లిళ్లకు బ్రేక్‌పడింది. కాగా, సోమవారం నుంచి శ్రావణ మాసం మొదలవుతుండగా.. నెలపాటు అంటే వచ్చే నెల 4 వరకు మంచి ముహూర్తాలు ఉన్నట్టు వేద పండితులు చెబుతున్నారు.
ఈ నెల 8, 9,10,11,15, 17,18,22,23,24,28, 30వ తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. 9వ తేదీ నుంచి పండుగలు స్టార్ట్ కానున్నాయి. 9న నాగుల పంచమి, 16న వరలక్ష్మీ వ్రతం, 19న రాఖీ పౌర్ణమి పండుగలు ఉన్నాయి. మంచి ముహూర్తాలు ఉండడంతో ఈ మాసంలోనే పెళ్లిళ్లు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.