ఆదిలాబాద్ జిల్లాలో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఆదిలాబాద్ జిల్లాలో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

 

  • అంత్యక్రియల్లో పాల్గొన్న ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
  • బాధిత కుటుంబానికి ఆర్థికసాయం రూ. 30 వేలు

నేరడిగొండ(ఇచ్చోడ), వెలుగు:  ఆదిలాబాద్ జిల్లాలో గుండెపోటుతో కానిస్టేబుల్  చనిపోయాడు.  ఇచ్చోడ మండల కేంద్రంలో నివసించే కానిస్టేబుల్ రాథోడ్ విలాస్(35), 2012 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం ఇంద్రవెల్లి పీఎస్ లో డ్యూటీ చేస్తున్నాడు.  సోమవారం ఉదయం తన ఇంట్లో అకస్మాత్తుగా ఆయన గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు ఆదిలాబాద్  రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. 

రాథోడ్ విలాస్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం తెలియడంతో ఎస్పీ అఖిల్ మహాజన్ కానిస్టేబుల్ సొంతూరు సోనాల మండలం సంపత్ నాయక్ తండాకు వెళ్లి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

విలాస్ కుటుంబ సభ్యులకు తక్షణ ఆర్థికసాయంగా రూ.30వేలు అందించారు. బాధిత కుటుంబానికి పోలీసుశాఖ తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. సీఐలు గురుస్వామి, ఎం. ప్రసాద్, ఎస్ఐలు సాయన్న, సంజయ్ కుమార్, శ్రీసాయి, పోలీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గిన్నెల సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది ఉన్నారు.